వైసీపీలోకి వలసలు ఊపందుకున్నాయి. పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, వైసీపీలో చేరారు. జగన్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా బుట్టా రేణుక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి షరతులు లేకుండా వైసీపీలో చేరానని బుట్టా రేణుక అన్నారు. మళ్లీ సొంత ఇంటికి వచ్చినట్లు ఉందని ఆమె తెలిపారు. పార్టీని గెలిపించేందుకు తన వంతు కృషి చేస్తామని ఆమె అన్నారు. మళ్లీ తనను పార్టీలోకి తీసుకున్నందుకు వైఎస్ జగన్‌కు బుట్టా రేణుకా కృతజ్ఞతలు తెలిపారు.
నాకు ఎక్కడ గౌరవం ఉంది? నాకు ఎక్కడ మంచి స్థానం ఉన్నదనే విషయం ఇప్పుడు తెలిసిందని రేణుక అన్నారు. “ఒక మహిళగా, బీసీ నాయకురాలిగా నాకు వైఎస్సార్ సీపీలో మంచి గౌరవం దొరికేది. చిన్న తప్పు వల్ల ఒక పెద్ద తప్పు జరిగింది. ఆ తప్పునకు శిక్ష కూడా అనుభవించా. టీడీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది. వైఎస్సార్ సీపీలో ఉన్న పారదర్శకత, స్పష్టత టీడీపీలో లేదు. అన్నీ మాటలే చెబుతారు. మభ్యపెట్టి మనుషులను మానసికంగా హింసిస్తారు. నేను రాకీయాలకు కొత్త అయినా, రెండు పార్టీల్లో ఎంతో అనుభవం వచ్చింది. ఏదో ఆశించి మాత్రం నేను ఇప్పుడు పార్టీలో చేరలేదు` అని అన్నారు.