నల్గొండ పార్లమెంట్ ఎన్నికల సన్నాహాక సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. చైతన్యానికి చిరునామా పోరాటాల పురిటి గడ్డ నల్గొండ జిల్లా అని, నల్లగొండ పార్లమెంట్ సీటు పై గులాబీ జెండా ఎగరాలని స్పష్టం చేశారు. కేంద్రంలో ఏ ఒక్క జాతీయ పార్టీకి పూర్తి స్థాయి మెజారిటీ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. రాష్ట్రంలో 16 సీట్లు గెలిచి టీఆర్ఎస్ పార్టీ కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో క్రియాశీలకంగా మారబోతోందని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల స్ఫూర్తితో మరోసారి కష్టపడితే పార్లమెంటు ఎన్నికల్లోనూ అఖండ విజయం ఖాయమని, మోడీ గ్రాఫ్ రోజు రోజుకూ పడిపోతుంది మరోవైపు కాంగ్రెస్ పార్టీని నమ్మే స్థితిలో దేశ ప్రజలు లేరని కేటీఆర్ స్పష్టం చేశారు. జరగబోయే పార్లమెంటు ఎన్నికలు దేశానికి చాలా కీలకంగా మారబోతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి జోష్ లేదు, బిజెపి పార్టీకి హోష్ లేదని కేటీఆర్ తెలిపారు.
కేంద్రాన్ని శాసించి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని, ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్టీ 16 సీట్లను అఖండ మెజారిటీతో గెలుపొందేలా ప్రతీ కార్యకర్త కృషి చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. అంతకుముందు ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి 10వేల బైకులతో భారీ ర్యాలీగా కేటీఆర్ గారికి ఘనస్వాగతం పలికారు. సభప్రాంగణంలో కేటీఆర్ పార్టీ జెండా ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సమావేశంలో ఎంపీలు గుత్తా సుఖేందర్ రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, గాదరి కిశోర్, బొల్లం మల్లయ్య యాదవ్, రవీంద్ర కుమార్, నోముల నర్సింహయ్య, నల్లమోతు భాస్కర్ రావు, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కర్నె ప్రభాకర్ మరియు తదితర నాయకులు పాల్గొన్నారు.