మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యోదంతం నేపథ్యంలో ఆయన కుమార్తె సునీతా రెడ్డి, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి జీకే ద్వివేదిని కలిశారు. తన తండ్రి హత్య కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని వారు ఫిర్యాదు చేశారు. సాక్షాత్తు ముఖ్యమంత్రే విచారణను తప్పుదారిపట్టించే విధంగా వాఖ్యానించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎం చేస్తోన్న వ్యాఖ్యలు విచారణాధికారులను ప్రభావితం చేసేలా ఉన్నాయని వారు వివరించారు. వివేకా హత్య కేసును నిష్పాక్షికంగా విచారించి అసలు దోషులకు శిక్షపడేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. సిట్ విచారణ పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. త్వరలో కేంద్ర ఎన్నికల సంఘానికి సైతం ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. తన తండ్రి హత్యపై పలువురు నేతలు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పేపర్ క్లిప్పింగ్‌లను ద్వివేదికి సమర్పించారు.
