కాంగ్రెస్ సీనియర్ నేతలుగా పేరొందిన కోమటిరెడ్డి బ్రదర్స్‌లో ఓటమి భయం ప్రారంభం అయిందా? భువనగిరి పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున పోటీచేస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డికి గెలుపుపై భరోసా లేదా? అంటే అవుననే సమాధానం వస్తోంది తాజాగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో.
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో అన్న వెంకట్‌రెడ్డి ఓడిపోతే మునుగోడు శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని ఆరోపించారు. కోమటిరెడ్డి సోదరుల జోలికి వస్తే ఓటమి ఖాయమని వ్యాఖ్యానించారు.
డబ్బులకు ఎంపీ సీట్లు అమ్ముకున్న పార్టీ టిఆర్ఎస్ పార్టీ అని ఆరోపించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే… టీఆర్ఎస్ 16 ఎంపీ సీట్లు కైవసం చేసుకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ మరో సవాల్ విసిరారు. టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులంతా డమ్మీలని వ్యాఖ్యానించారు. అయితే, గెలుపు ఖాయమని అనుకున్నపుడు సన్యాసం సవాల్ ఎందుకు విసరాలని పలువురు చర్చించుకుంటున్నారు.