లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రచార సభలు షెడ్యూల్ ఖరారు అయింది. ఈనెల 29 నుంచి ప్రారంభంకానున్నాయి. ప్రతి రోజు రెండు సభలు ఉండే విధంగా షెడ్యూల్‌ను ఖరారు చేశారు. వేసవి కాలంలో నేపథ్యంలో సాయంత్రం 4 గంటలకు సభలను ప్రారంభించాలని నిర్ణయించారు. ఈనెల 29 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు 13 నియోజకవర్గాల్లో షెడ్యూల్‌ను ఖరారు చేశారు. మొదటి విడతలో ఆదిలాబాద్ మినహా మిగిలిన లోక్‌సభ నియోజకవర్గాల్లో సభలు ఉండే విధంగా ప్రణాళిక రూపొందించారు.
ఎన్నికల శంఖారావాన్ని సీఎం కేసీఆర్ ఈనెల 17వ తేదీన కరీంనగర్ నుంచి పూరించారు. 19న నిజామాబాద్‌లో సభ జరిగింది. మార్చి 29న నల్గొండ పార్లమెంట్ పరిధిలోని మిర్యాలగూడలో సాయంత్రం 4 గంటలకు మొదటి సభ జరుగుతుంది. గ్రేటర్ హైదరాబాద్‌లోని పార్లమెంట్ నియోజకవర్గాలు సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, చేవేళ్లలో ఓటర్లకు సంబంధించి మార్చి 29న ఎల్బీ స్టేడియంలో సాయంత్రం 5.30గంటలకు సభ ఏర్పాటు చేశారు. ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో కనీసం ఒక సభ ఉండే విధంగా ప్రణాళిక రూపొందించారు. భౌగోళికంగా పెద్ద నియోజకవర్గాల్లో రెండు మూడు సభలు నిర్వహించాలని నిర్ణయించారు. ఆదిలాబాద్, మహబూబాబాద్, జహీరాబాద్, నల్గొండ, పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో రెండు సభలు ఉండే అవకాశాలున్నాయి. 16సీట్లు లక్ష్యంగా రంగంలోకి దిగన టీఆర్‌ఎస్‌కు క్షేత్ర స్థాయిలో ప్రజల నుంచి అద్బుతమైన స్పందన వస్తుంది.
ఈనెల 25వ తేదీతో నామినేషన్ల గడువు ముగియనుంది. 26న నామినేషన్ల పరిశీలన, 28తో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది. ఆ తరువాత తేదీ నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఎన్నికలకు పార్టీ శ్రేణులను పూర్తి చేయడానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా సన్నాహక సమావేశాలను నిర్వహించారు.