ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీరుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ప్రచార తీరు, ఆయన చేస్తున్న విమర్శలను గురించి ప్రస్తావిస్తూ…వరుస ట్వీట్లలో ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో సొల్లువాగుడు వాగాడని మండిపడ్డారు. “50 శాతం వివిప్యాట్లను లెక్కించాలని చంద్రబాబు సుప్రీంకోర్టుకు కెళ్తే అసెంబ్లీ సెగ్మెంటుకు ఐదు కౌంట్ చేస్తే చాలని తీర్పు చెప్పింది. అయినా వివిప్యాట్లన్నిటిని లెక్కించాలని డిమాండు చేస్తున్నాడు. ఎలక్షన్ అనేది ఆయన ఒక్కడి కోసం జరిగేది కాదు. సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవించాలన్న స్పృహ కూడా లేదు“ అంటూ చంద్రబాబు తీరుపై విరుచుకుపడ్డారు.
ఈ సందర్భంగా చంద్రబాబు పాకిస్థాన్‌లో ప్రచారం చేసినా…ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. “కర్నాటక ఎలక్షన్ ప్రచారంలో రూపాయి విలువ పడిపోయిందని, పర్యావరణ పరిరక్షణలో వెనకబడిందని, దేశంలో అసమానతలు అలాగే ఉన్నాయని సొల్లు వాగాడు. పాకిస్థాన్ వాళ్లు పిలిచినా ప్రచారం చేసొస్తాడు. ఐదేళ్లు ఏపీలో పంచభూతాలను హాం ఫట్ చేసిన వ్యక్తి సిగ్గులేకుండా దేశాన్ని కించపరుస్తున్నాడు“ అంటూ మండిపడ్డారు.
జాన్8 వరకు తానే సీఎంని అని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను విజయసాయిరెడ్డి తప్పుపట్టారు. “నేనే సీఎం మధ్యన ఈసీ పెత్తనం ఏంటి? అమెరికాలో ఎన్నికల తర్వాత 8 వారాలు పాత ప్రభుత్వమే కొనసాగుతుంది తెలుసా అంటూ బుకాయిస్తున్నారు. మీరు అమెరికన్ రాజ్యాంగాన్ని అనుసరించి పాలిస్తున్నారా లేక అంబేద్కర్ రాసిన మన దేశ రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నారా చంద్రబాబూ?“ అంటూ సూటిగా ప్రశ్నించారు.