ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఛాంబర్ సిద్ధం అయ్యింది. తాజాగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం వైఎస్ జగన్ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానున్నారు. అలాగే సీఎంగా పగ్గాలు చేపట్టిన రెండోరోజే ఆయన సచివాలయంలో అడుగు పెట్టనున్నారు. శుక్ర, శనివారాల్లో జగన్ సచివాలయంలో పరిపాలనా వ్యవహారాలు సమీక్షిస్తారు. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ , వైఎస్సార్ సీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి బుధవారమే సచివాలయంలో ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. సచివాలయం మొదటి బ్లాక్‌లోని సీఎం ఛాంబర్, క్యాబినెట్ సమావేశ మందిరం, సీఎం కాన్వాయ్ రూట్‌తో పాటు సీఎం నేమ్ ప్లేట్‌ను ఆయన పరిశీలించారు. జగన్ ప్రమాణ స్వీకారం దాదాపుగా కోట్లమంది వీక్షించారు. జగన్ సూచనమేరకు చాలామంది రాకుండా ఉండిపోయినా విజయవాడ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి.
