ఎవరైనా ఏదైనా కొత్త పని ప్రారంభించాలన్నా మంచిరోజు, ముహూర్తాలు చూసుకుంటాం.. అలాగే, వైఎస్. జగన్ మోహన్ రెడ్డికి కూడా ఒకరోజు సెంటిమెంట్ వస్తోంది. తాజా ఎన్నికల ఫలితాల్లో వైసీపీ అఖండ విజయం సొంతం చేసుకుంది. దీంతో నవ్యాంధ్ర సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేసారు. మే 30 గురువారం 12.23 నిమిషాలకు జగన్ సీఎంగా ప్రమాణం చేసారు. అయితే ఎన్నికల పోలింగ్, ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి, జగన్ ప్రమాణ స్వీకారం అన్నీ కూడా యాధృచ్ఛికంగా గురువారమే వచ్చాయి. ఎన్నికల తొలిదశ పోలింగ్ ఏప్రిల్ 11 గురువారం జరిగింది. మే 23 గురువారం ఓట్లు లెక్కించారు. అలాగే మే 30వ గురువారం జగన్ ప్రమాణం చేసారు. దీంతో జగన్‌మోహన్‌రెడ్డికి గురువారం కలిసొచ్చిందంటూ ఆసక్తికర చర్చ జరిగింది.
అలాగే పాదయాత్ర, ఓదార్పుయాత్రలోని ముఖ్యఘట్టాలు కూడా గురువారం వచ్చాయంటూ పలువురు విశ్లేషిస్తున్నారు. వారం, వర్జ్యం గురించి తెలిసిన వారు గురువారం చాలా గొప్పగా చర్చించుకుంటున్నారు. అలాగే ఈ ఎన్నికల్లో వైసీపీ సాధించిన ఎమ్మెల్యేల స్థానాలు 151ని ఎటు నుంచి చూసినా (వెనుక నుంచి ముందుకు 151, ముందు నుంచి 151 అంకెలు వస్తాయి) ఇదొక విశేషం.. అలాగే రాష్ట్ర చరిత్రలో ఒకే పార్టీ ఒంటరిగా పోటీచేసి ఏకంగా 86శాతం ఎమ్మెల్యేలను వైఎస్సార్‌సీపీ సాధించడం మరో రికార్డు. అలాగే చంద్రబాబు ఫిరాయింపచేసిన 23మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు ఆయన పార్టీ గెలవడం.. అదికూడా 23వ తేదీన ఫలితాలు రావడం కూడా ఏపీ ప్రజలు విశేషంగా చెప్పుకుంటున్నారు.