దశాబ్దకాలంగా జగన్‌ను ఇలా చూడాలని తపించిన అభిమానులకు గురువారం పండగరోజు.. తమకోసం ఆలోచించే జగన్‌కు మంచి జరగాలని ప్రార్థించని పెదవులు లేవు.. ప్రజాసంకల్పం జయించిన జగన్ వైయస్ జగన్మోహన్‌రెడ్డి అను నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్నాను అనే ఈ మాటలకోసం సంవత్సరాలతరబడి ఆశగా ఎదురుచూసిన ప్రజల కోరిక నెరవేరింది. పాదయాత్ర దారెంబడి జగన్ ఎక్కడ కనిపించినా సీఎం, సీఎం అని నినదించిన ప్రజావాక్కు నిజమైంది. గతంలో వైఎస్ ను కూడా ప్రజలు, ఆయన అభిమానులు ఇలాగే సీఎం సీఎం అని పిలుచుకునేవారు. రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ప్రజలు కనివినీ ఎరుగని ఓట్లశాతంతో అద్భుతమైన మెజారిటీతో విజయం ఏకపక్షం చేసారు.
అలాగే 2019 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ వారసులను జనం తిరస్కరిస్తే వైఎస్ వారసుడిగా జగన్‌కు ఏకంగా ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేసేసారు. రాజన్న వారసుడిగా నే జగన్ మిగిలిపోలేదు.. అహర్నిశలు శ్రమించి తనేంటో ఫ్రూవ్ చేసుకున్నారు. ప్రజలు కూడా రాజన్నరాజ్యం కావాలని బలంగా కోరుకున్నారు. నాన్న చేసినట్టుగానే సంక్షేమపథకాల్ని, అభివద్ది పనులను చేస్తానని మాటిచ్చారు. జగన్‌ను ప్రజలు బలంగా విశ్వసించి లోక్‌సభలోనూ శక్తివంతమైన ప్రాంతీయనాయకుడిగా వైఎస్ మాదిరిగానే జగన్ ఆవిర్భవించారు. ప్రమాణస్వీకారం నాడు కూడా చేతికి తండ్రి వాచీ.. నాడు వైఎస్ ముఖ్యమంత్రిగా తొలి సంతకం చేసిన పెన్నుతోనే ఇప్పుడు జగన్ కూడా తొలిసంతకం.. వేదికపై జగన్ వైయస్ఆర్ లా కనిపించారు.
ప్రసంగం తీరు సైతం ఆయన్నే గుర్తుకు తెస్తూ సాగినవైనం పార్టీ శ్రేణులు, అభిమానులను ఆకట్టుకుంది. అన్నీ వైఎస్ రాజశేఖరరెడ్డిని తలపించాయి. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రమాణ స్వీకారానికి, గురువారం వైయస్ జగన్ ప్రమాణ స్వీకారానికి మధ్య ఎన్నో సారూప్యతలు కనిపించాయి. ప్రసంగించేందుకు మైక్ వద్దకు రాగానే మెల్లగా టక్ టక్ టక్‌మని కొడుతూ చిరునవ్వులు చిందిస్తూ అందర్నీ కళ్లతోనే పలకరించారు. అందరికీ రెండుచేతులు జోడించి నమస్కరిస్తున్నాని తండ్రి శైలిలో రెండు చేతులు ఎత్తి నమస్కరించడంతో సభికులందరి కళ్లముందు ఒక్కసారి వైఎస్ సాక్షాత్కరించినట్లు కనిపించింది.