ముఖ్యమంత్రి హోదాలో జగన్‌మోహన్‌రెడ్డి తొలిసారి వెలగపూడిలోని సచివాలయంలో అడుగుపెట్టారు. సచివాలయంలోని ఫస్ట్ బ్లాకు మొదటి అంతస్తులోని సీఎం కార్యాలయంలోకి జగన్ శనివారం ఉదయం 8.39 గంటలకు ప్రవేశించారు. వేదపండితులు ఆయనకు ఆశీర్వచనం అందించారు. ఈకార్యక్రమంలో సీఎస్‌ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ గౌతమ్ సవాంగ్, వైఎస్సార్సీపీ నేతలు పాల్గొన్నారు. అంతకుముందు ముఖ్యమంత్రికి ఉద్యోగులంతా ఘనంగా స్వాగతం పలికారు. ఉదయం 8.15గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి సెక్రటేరియట్‌కు బయల్దేరారు జగన్..
ఈ కార్యక్రమం పూర్తైన తర్వాత ఉదయం 9.30గంటలకు సీఎం అన్ని శాఖల కార్యదర్శులను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం సచివాలయ ఉద్యోగుల సంఘం నేతలతో సమావేశం అయ్యారు. సీఎం కార్యాలయం పక్కనే గల కాన్ఫరెన్స్ హాల్లో ప్రొటెంస్పీకర్‌గా నియమితులైన శంబంగి చిన అప్పలనాయుడుచే 11.15గంటలకు గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ సహా పలువురు ఉన్నతాధికారులు, పార్టీ నేతలు హాజరయ్యారు.