Home / EDITORIAL / కేసీఆర్ తెలంగాణ”కాళేశ్వరరావు”

కేసీఆర్ తెలంగాణ”కాళేశ్వరరావు”

తెలంగాణలో వ్యవసాయాన్ని పండుగ చేసేందుకు అపర భగీరథుడు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గోదావరి నది మీద ప్రారంభించిన కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తికావచ్చింది. ఈ ప్రాజెక్టును ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 21న ప్రారంభించనున్నారు.ఎస్సారెస్పీ నుంచి కాళేశ్వరం గుడి దాకా ఉన్న గోదావరి నది నీళ్లు లేక వట్టిపోయింది. మహారాష్ట్ర గోదావరి మీద వందలాది బ్యారేజీలను నిర్మించుకున్నది. ఈ పరిస్థితుల్లో ఎస్సారెస్పీ నీటి కోసం మొదటి ఆయకట్టు నుం చి చివరి ఆయకట్టు దాకా నోళ్లు తెరుచుకొని ఎదురుచూస్తున్న సారవంతమైన సాగు భూముల పరిస్థితి ఏంగావాలె.? ఎస్సారెస్సీ కింద పారకంలో ఉన్న 18 లక్షల ఎకరాలకు పైగా సాగు యోగ్యమైన భూమి వృథాగా మారే పరిస్థితుల నుంచి తెలంగాణను ఎట్లా కాపాడుకోవాలె.? దాంతో పాటు గోదావరి బేసిన్‌లో ఉన్న ఉత్తర తెలంగాణ జిల్లాలు తలాపు నుంచి గోదారి పారుకుంటా పోతున్నా దాదాపు 20 లక్షల ఎకరాల సాగుభూమి ఎడారి గా మారుతున్న పరిస్థితులున్నయి.

మరి వాటిని ఎట్లా మార్చాలె.? ఈ ఆలోచనలే సీఎం కేసీఆర్ మదిలో మేడిగడ్డ వద్ద బ్యారేజీకి అంకురమేసిం ది. ప్రాణహిత రూపంలో తెలంగాణకు సాగునీటి పరిష్కారం దొరికింది. ఈ నదిలో వరద నిరంతరం ఉంటుంది. అందుకు కారణం కొన్ని వందల కిలోమీటర్ల దాకా అది అటవీ ప్రాంతం గుండా ప్రయాణించడం. క్యాచ్ మెంట్ ఏరియాలో ఒక్క ఎకరం కూడా సాగు భూమి లేదు. అక్కడ అటు ఛత్తీస్‌గఢ్ కానీ ఇటు మహారాష్ట్ర కానీ ప్రాజెక్టులు కట్టడానికి వీల్లేదు. బ్యారేజీల నిర్మాణం సాధ్యం కాకపోవడంతో పడిన ప్రతి వాన చుక్కా ప్రాణహితను చేరుకుంటుంది. అట్లా ప్రాణహిత దిగువకు ప్రవహించి కాళేశ్వర ముక్తేశ్వరుని వద్ద త్రివేణి సంగమ స్థలిలో గోదావరిలో కలుస్తున్నది. ఎస్సారెస్సీ నుంచి కాళేశ్వరం దాకా ఎండిపోయిన గోదావరి ప్రాణహిత కలువ డం ద్వారా తిరిగి ప్రాణం పోసుకుంటుంది.

కాళేశ్వరం నుంచి కిందికి పోయే గోదావరి వరద ఏటా సగటున దాదా పు 3000 టీఎంసీలు ఉంటదని సీడబ్ల్యూసీ లెక్కలు చెపుతున్నయి. ఈ ప్రాణహిత గోదారి నీటిని వృథాగా పోనియ్యకుండా మేడిగడ్డ వద్ద బ్యారేజీని నిర్మించాలని ముఖ్యమంత్రి నిర్ణయించినారు. ప్రాణహిత నీటిని మేడిగడ్డ కాడ నిల్వచేయడం ఒకెత్తయితే, నిల్వచేసిన నీటిని ఎప్పటికప్పుడు ఎత్తిపోసి తెలంగాణ బీళ్లను తడుపాలనేది రెండో ఆలోచన. ఈ క్రమంలో మేడిగడ్డ నుంచి ఎస్సారెస్పీ దాకా వంద కిలోమీటర్ల వెనుక దిక్కుకు రివర్స్ పంపింగ్ చేసి, దాదాపు ఖాళీగా ఉన్న గోదావరిని నింపాలనే ఆలోచన చేశారు సీఎం కేసీఆర్. అట్లా వీలైనకాడికి గోదావరినే అక్కడక్కడ కట్టలు కట్టి సహజ రిజర్వాయర్‌గా మార్చితే ఎట్లా ఉంటుందనే ఆలోచన చేసిన సీఎం, అన్నారం, సుందిల్ల వద్ద బ్యారేజీలను నిర్మించినారు. అప్పటికే నిర్మాణమై వినియోగంలోకి వచ్చి ఎల్లంపల్లితో కలుపుకొని మొత్తం ఐదు బ్యారేజీలున్నయి. అంటే.. మేడిగడ్డ నుంచి పైకి అన్నారం, సుందిల్ల, ఎల్లంపల్లి, ఎస్సారెస్పీ దాకా, ఈ ఐదు ప్రాజెక్టుల్లో 120 కిలోమీటర్ల మేరకు గోదావరిని దాదాపు 135 టీఎంసీల నీటితో నింపడమనే కేసీఆర్ చేసిన భగీరథ ప్రయత్నం.

ప్రాణహిత వరదనీటిని కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధాన ప్రాజెక్టు అయిన మేడిగడ్డ బ్యారేజీ దాదాపు 16 టీఎంసీల దాకా ఆపుతుంది. అంతేకాకుం డా ప్రతిరోజు వరద వస్తనే ఉంటది. మేడిగడ్డ చివరి నుంచి (కన్నేపల్లి పం ప్ హౌజ్ నుంచి) నీటిని ఎత్తి అన్నారం బ్యారేజీలో పోయడం. అట్లా అన్నారం బ్యారేజీని నింపి అది నిండంగనే దాని చివర (అన్నారం పంప్ హౌజ్‌లు) పంపులు బిగించి అక్కడి నుంచి నీటి ఎత్తి సుందిల్ల బ్యారేజీలో పోయడం. అది నిండంగనే అక్కడినుచి ఎత్తిపోసి రివర్స్‌లో తీసుకపోయి (గోలివాడ పంప్ హౌజ్) ఎల్లంపల్లిలో కలుపడం. ఇక్కడిదాకా ఓకే. మరి ఎస్సారెస్సీని ఎట్టా నింపాలె? దాంతోపాటు మిడ్ మానేరు ఎట్లా నింపడం అనేది మూడో టాస్కు. ఎస్సారెస్పీని ఎట్లా నింపుతరనే విషయానికి వస్తే.. ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ నుంచి నీళ్లను పంపుల ద్వారా ఎత్తిపోస్తరు. ఇటీవల ప్రారంభమై యావత్ ప్రపంచాన్ని ఆసక్తిలో ముంచెత్తిన తెలంగాణ ప్రజలను కేరింతలకు గురిచేసిన పంపుల గుండా ఎగజిమ్మి సాగిన ప్రవాహాల దృశ్యాలు ఇక్కడి నుంచే. మనం చూసిన ఆ ఏడు పంపులు ఎల్లంప ల్లి బ్యాక్ వాటర్‌ను సొరంగాలు సర్జ్‌పూల్ల గుండా నందిమేడారం చెరువులకు ఎత్తిపోసే పంపులే. అట్లా నంది మేడారం నుంచి ఎత్తిపోసిన నీళ్లు ఎత్తులు పల్లాలు దాటుకుంటా, మళ్ల మళ్ల ఎత్తిపోసుకుంటా వాటిని ఎస్సారెస్సీ వరద కాల్వల కలుపుతరు.

మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి అటు నుంచి నందిమేడారం మీదుగా వరద కాల్వదాకా ప్రాణహిత గోదావరి నీళ్లు వస్తయి. ఆ నీళ్లను వరద కాల్వనుంచి మళ్లా ఎనుకకు ఎత్తిపోసుకుం టా పోసుకుంటా తీస్కపోయి ఎస్సారెస్పీల పోస్తరన్నమాట. అదే సమయంలో వరదకాలువ ఇటు కిందికి పోతది. ఈ ప్రాణహిత నీళ్లను అటు ఎస్పారెస్పీ దిక్కుకు రివర్స్ పంపింగ్ ద్వారా ఎనుకకు తీసుకపోతరు. ఇటు మిడ్ మానేరుకు గ్రావిటీ కాలువ ద్వారా కిందికి తీస్కపోతరు. అట్లా మిడ్ మానేర్‌లో పోసిన నీళ్లను ఎప్పటికప్పుడు ఎత్తిపోసుకుంటా పోసుకుంట కొండపోచమ్మ సాగర్, మల్లన్నసాగర్ దాకా అనేక రిజర్వాయర్లను, చెరువులు కుంటలు నింపుకుంటా కరీంనగర్ నుంచి ఇటు ఆలేరు సూర్యపేట దాకా తెచ్చి 18 లక్షల ఎకరాలకు పైగా సాగుభూములకు నీళ్లిస్తరు.

అదే సందర్భంలో వరుద కాలువ నుంచి పైకి తీస్కపోయి ఎస్సారెస్పీ లో పోసిన నీళ్లను, పెట్టిన పొయ్యోలిగె ఉన్న ఆ ప్రాజెక్టు కింది కాలువల ద్వారా 18 లక్షలకు పైగా ఎకరాల పాత ఆయకుట్టుకు నీళ్లను పారించి స్థిరీకరిస్తరు. వీటితోపాటు ఎటు కాలువ పోతే అటు రిజర్వాయర్లను, ఇటు చెరువులను నింపుతరు. అట్లా అటు మిడ్ మానేరు నుంచి 18 లక్షలకు పైగా ఇటు ఎస్సారెస్పీ నుంచి 18 లక్షలకు పైగా అంటే మొత్తం 37 లక్షలనుంచి 40 లక్షల ఎకరాలకు నీరందిస్తరు. దాంతోపాటు ఈ మొత్తం రిజర్వాయర్ల జాలయితేంది.. వాటిద్వారా పెరిగిన భూగర్భ జలాల ద్వారా అయితేంది.. నిండిన ఇతరత్రా కుంటలు చెరువుల ద్వారా అయితేంది.. మరో 10 లక్షల ఎకరాలు సాగులకు వస్తయి. అట్లా మొత్తంగా యాభై లక్ష ల ఎకరాలకు ఈ కాళేశ్వరం ప్రాజెక్టుల ద్వారా సాగునీటిని అందించడమ నే భగీరథ లక్ష్యానికి చేరువలోకి వచ్చినం మనం. సీఎం కేసీఆర్ ఆధ్వర్యం లో కాళేశ్వరం ప్రాజెక్టుల కోసం యుద్ధం చేసినట్టు సాగుతున్న బ్యారేజీల నిర్మాణమైతేనేమీ, పంప్‌హౌజ్‌లు ఇంకా ఇతర నిర్మాణాలు అయితేనేమీ దాదాపు పూర్తి గావచ్చినయి. By Ramesh Hazari

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat