తెలంగాణ మున్సిపల్ చట్టం -2019 బిల్లును శాసనసభ ఆమోదించింది. ఈ బిల్లును ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న సభలో ప్రవేశపెట్టారు. ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సభలో బిల్లుపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. చర్చ జరిగిన అనంతరం తెలంగాణ మున్సిపల్ చట్టం -2019 బిల్లును సభ ఆమోదించింది.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. మున్సిపల్ చట్టంపై సలహాలు, సూచనలు ఇచ్చిన సభ్యులకు ధన్యవాదాలు. జనాభా దామాషా ప్రకారమే రిజర్వేషన్లు ఖరారు చేస్తాం. సమయానికి అనుకూలంగా చట్టంలో మార్పులు, చేర్పులు చేయకపోతే భవిష్యత్ తరాలు నష్టపోతాయి. కలెక్టర్కు అధికారాలు అంశంపై కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ వ్యవస్థను కించపరిచేలా సూచనలు చేయడం సరికాదు. ప్రజలకు మేలు చేసేందుకు కలెక్టర్లు సూచనలు మాత్రమే చేస్తారు.
కాంగ్రెస్ ఉద్దేశం ఏంటో ఎప్పటికీ అర్థం కాదు. ఏదీ కట్టొద్దు.. అంతా యథాతథంగా ఉండాలనేది కాంగ్రెస్ వైఖరి. కాంగ్రెస్ హయాంలో ఎలా ఉందో.. ఇప్పుడు కూడా అలానే ఉండాలా? జిల్లా కలెక్టర్కు అధికారాలు ఇవ్వొద్దని అనడం కరెక్ట్ కాదు. కలెక్టర్కు కొత్తగా ఇచ్చిన అధికారం కాదు.. ముందునుంచీ ఉంది. సర్పంచ్ల విషయంలో మంత్రికి స్టే ఇచ్చే అధికారాన్ని తొలగిస్తే తప్పేంటి? అనేక మంది మేధావులు ఫోన్ చేసి చట్టం బాగుందని చెప్పారు.
ఇదే అరాచకం, ఇవే లంచాలు కొనసాగాలా? సరైన ప్రణాళిక ప్రకారం.. అభివృద్ధి పనులు చేపడుతుంటే అడ్డుకుంటున్నారు. ఆరోగ్యశ్రీని ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ.. దాన్ని కొనసాగిస్తామని మేం చెప్పాం. నియంత్రణలో పని జరగాలి. నిర్దేశించిన బాధ్యతలు అందరూ నిర్వర్తించాలి. కాంగ్రెస్ నేతలు ప్రతి అంశాన్ని గుడ్డిగా వ్యతిరేకిస్తున్నారు.. ఆరోపణలు చేస్తున్నారు. కలెక్టర్ల చేతిలో నియంత్రణ మాత్రమే పెట్టాం.. వారికి పూర్తి అధికారాలు ఇవ్వలేదు. ఇటువంటి చట్టాన్ని ఏకగ్రీవంగా ఆమోదిస్తే.. ఓ బలమైన సందేశం ప్రజలకు అందుతుంది. స్థానిక సంస్థల ప్రతినిధుల అధికారాలను హరించాలన్నది మా ఉద్దేశం కాదు అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
Post Views: 304