Home / SLIDER / చింతమడకలో సీఎం కేసీఆర్ ఏమి ఏమి చేయనున్నారంటే..!

చింతమడకలో సీఎం కేసీఆర్ ఏమి ఏమి చేయనున్నారంటే..!

నేను మళ్లీ వస్తా.. అన్ని విషయాలను మాట్లాడుకుందాం.. మీతో రోజంతా గడుపుతా.. శాసనసభ ఎన్నికల సందర్భంగా ఓటు వేయడానికి స్వగ్రామానికి వచ్చినప్పుడు సీఎం కేసీఆర్ చింతమడక గ్రామస్థులతో అన్న మాటలివి. ఇచ్చిన మాట ప్రకారం సోమవారం సొంతూరుకు రానుండటంతో గ్రామస్థులు మహా సంబురపడుతున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే గ్రామంలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిన అధికారులు దాని ప్రకారం ప్రతిపాదనలను రూపొందించారు. సీఎం కేసీఆర్‌కు ఘనస్వాగతం పలుకడానికి చింతమడక గ్రామమంతా దసరా, దీపావళి, ఉగాది పండుగలు చేసుకున్నంత సంబురంతో ఎదురుచూస్తున్నది. గ్రామప్రజలు ఇండ్లను శుభ్రం చేసుకొని మామిడి తోరణాలు కట్టుకొని అలంకరించుకున్నారు. గ్రామంలోని ప్రధాన రహదారులకు ఇరువైపులా హరితహారం మొక్కలు నాటారు. మాజీమంత్రి, సిద్దిపేట శాసనసభ్యుడు తన్నీరు హరీశ్‌రావు, జిల్లా కలెక్టర్ పీ వెంకట్రామ్‌రెడ్డి, పోలీసు కమిషనర్ జోయల్ డెవిస్ ఆదివారం గ్రామంలో పర్యటించి ఏర్పాట్లపై సమీక్షించి గ్రామస్థులతో సమావేశమయ్యారు.

సీఎం కేసీఆర్ ఉదయం 10.30 గంటలకు చింతమడక గ్రామానికి చేరుకుంటారు. బీసీ రెసిడెన్షియల్ పాఠశాలకు శంకుస్థాపన చేయడంతోపాటు డబుల్ బెడ్‌రూం ఇండ్లను ప్రారంభిస్తారు. ఇది కేవలం సీఎం కేసీఆర్ సొంతూరు గ్రామస్థులతో మమేకమయ్యే పర్యటన అయినందున ఇతరులెవరినీ అనుమతించడం లేదు. ముఖ్యమంత్రి గ్రామంలో కలియదిరుగుతారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో ఆత్మీయ సమావేశం, సహపంక్తి భోజనాలకు ఏర్పాట్లుచేశారు. 3200 మంది గ్రామస్థులకు ప్రత్యేకంగా తయారుచేయించిన పింక్ కలర్ ఐడీ కార్డులను అందించారు. వీరంతా ఐడీ కార్డులతో సభాస్థలికి చేరుకుంటారు. ప్రతి 30 కుటుంబాలకు ఒక ప్రత్యేకాధికారిని నియమించారు. 200 మంది అధికారులకు వైట్ గుర్తింపుకార్డులు, 200 మంది మీడియా ప్రతినిధులకు గ్రీన్ గుర్తింపుకార్డులను అందించారు. మొత్తంగా ఆరువేల మందికి భోజనాలను ఏర్పాటుచేస్తున్నారు. ఐకేపీ గోదాము వద్ద రెయిన్‌ప్రూఫ్ టెంట్‌ను నెలకొల్పారు. మహిళలకు, పురుషులకు వేర్వేరుగా గ్యాలరీలను ఏర్పాటుచేశారు. అధికారులు, మీడియాకు ప్రత్యేకంగా గ్యాలరీ ఉంటుంది. 60 మంది కూర్చొనేలా వేదిక రూ పొందించారు. వేదికకు కుడివైపున గ్రీన్ హౌస్ ను ఏర్పాటుచేశారు. సమావేశం అనంతరం భోజనాలకోసం మహిళలకు, పురుషులకు ప్ర త్యేక ఏర్పాట్లు చేశారు. సీఎం కేసీఆర్ ఆత్మీయులతో కలిసి భోజనం చేయడానికి పెద్దమ్మ గుడి పక్కనే రెయిన్‌ప్రూఫ్ టెంట్ వేశారు. పెద్దమ్మ గుడి ముందు చింతచెట్టు వద్ద గద్దెను కూడా నిర్మించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటుచేశారు.
CMKCR1

చరిత్రపుటల్లో చింతమడక

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్వగ్రామం సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట రూరల్ మండలం చింతమడక. ఇక్కడ వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. కేసీఆర్‌తో ఈ గ్రామానికి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. చరిత్ర పుటల్లో చోటుచేసుకుంది. ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్రమంత్రిగా పనిచేసిన నేత ఆయన. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి నాయకత్వం వహించి రాష్ర్టాన్ని సాధించి తొలి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి ప్రశంసలందుకున్నారు. రెండోసారి కూడా ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి అన్ని వర్గాల ప్రజల గుండెల్లో నిలిచారు. చింతమడక బిడ్డ ఇవాళ ఉన్నత స్థానంలో ఉండటంతో పురిటిగడ్డ పులకరించిపోతున్నది. ఉన్నతస్థానంలో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామస్థులతో ఆత్మీయత, అనుబంధాలు అలానే కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ గ్రామంలో ఉన్న స్నేహితులు, గ్రామపెద్దలతో ఆయన కలుపుగోలుగా ఉంటారు. గ్రామానికి వచ్చారంటే ప్రతివారిని పేరుపెట్టి పిలుస్తుంటారు. మొన్నటి శాసనసభ ఎన్నికల్లో ఓటు వేయడానికి సీఎం కేసీఆర్ దంపతులు వచ్చినప్పుడు గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు. కేసీఆర్ తన చిన్ననాటి మిత్రులను పేరుపెట్టి పిలిచి ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న ఆయన.. నేను మళ్ళీ వస్తా.. మీతో రోజంతా గడుపుతా అని మాటిచ్చారు. ఆ మాట ప్రకారం సోమవారం చింతమడకకు రానుండటంతో గ్రామస్థులు సంబురపడిపోతున్నారు.

సీఎం కేసీఆర్‌కు చిన్నతనం నుంచే ఎంతో మేధాశక్తి ఉండేది. పాఠశాల స్థాయిలో చిలిపి పనులు చేసిన అతడిలో చురుకుదనం కనిపించేదని కేసీఆర్ గురువు మృత్యుంజయశర్మ చెప్తుంటారు. తెలుగు వ్యాకరణం, భాషపై పట్టుసాధించేలా కృషిచేశారని అంటారు. కేసీఆర్ ఒకటో తరగతి నుంచి రెండో తరగతి వరకు అంకంపేట, మూడో తరగతి చింతమడకలో, నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు దుబ్బాకలో చదువుకున్నారు. అనంతరం ఉన్నత చదువులు సిద్దిపేటలో చదువుకున్నారు. పాఠశాల స్థాయిలో కేసీఆర్ ప్రతిరోజూ చింతమడక నుంచి దుబ్బాక వరకు కాలినడకనే వెళ్ళివచ్చేవారు. చింతమడక గ్రామానికి చెందిన రాఘవరెడ్డి అనే హిందీ పండితుడు కొంతకాలానికి దుబ్బాక పాఠశాలకు వచ్చారు. అప్పుడు ఆయన దుబ్బాకలోనే నివాసం ఉండటంతో కేసీఆర్, ఆయన సోదరి సుమతి కూడా వారి ఇంట్లోనే ఉండేవారు. కేసీఆర్ మిత్రుల మాటల ప్రకారం.. పాఠశాలలో సాంస్కృతిక ప్రదర్శనల్లో భాగంగా పౌరాణిక నాటకాల్లో కూడా ఆయన పాత్రలు వేసేవారు. శ్రీకృష్ణ పాండవీయం నాటకంలో పంచపాండవుల్లో చివరివాడైన సహదేవుని పాత్రను కేసీఆర్ పోషించారు. పాఠశాల విద్యార్థి సంఘ నాయకత్వానికి జరిగిన పోటీలో గెలిచి ఉపాధ్యక్షునిగా పనిచేశారు.
SDP5

చింతమడక సమగ్ర అభివృద్ధి

కేసీఆర్ స్వగ్రామం కావడంతో చింతమడకలో అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ప్రత్యేక శ్రద్ధతో ఈ గ్రామంలో అభివృద్ధి పనులను పూర్తిచేయిస్తున్నారు. కేసీఆర్ సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తన సొంత భూమి 70 ఎకరాలను ఎస్సీ కార్పొరేషన్‌కు అందజేశారు. తన ఇంటిని పాఠశాలకు ఇవ్వడంతో కొన్నాళ్లపాటు పాఠశాల నడిపించారు. ప్రస్తుతం అక్కడ భారతీయ స్టేట్ బ్యాంకు కొనసాగుతున్నది. ఇంటి ఆవరణలో జిల్లా పరిషత్ పాఠశాల భవనాన్ని నిర్మాణం చేయడంతో విద్యార్థులు ఆ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నారు. పలు అభివృద్ధి పనులతో చింతమడకను ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దుతున్నారు. గ్రామంలో రూ.60 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం, రూ.45 లక్షలతో ఆర్‌అండ్‌బీ డ్రైనేజీ పనులు, 48 డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం పూర్తిచేశారు.

మరో 24 డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం పూర్తికాగా లబ్ధిదారులతో సోమవారం సీఎం కేసీఆర్ గృహప్రవేశాలు చేయించనున్నారు. బీసీ గురుకుల పాఠశాలకు భూమిపూజ చేస్తారు. గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఐకేపీ గోదాము, సీసీ ప్లాట్‌ఫాం, నూతన పంచాయతీ భవనంతోపాటు అన్ని కులాలకు కమ్యూనిటీ హాళ్లను నిర్మించారు. ప్రాథమిక పాఠశాలకు మోడల్ భవనాన్ని నిర్మించారు. పెద్దమ్మ దేవాలయం వద్ద ఫంక్షన్‌హాల్, మిషన్ భగీరథతో ఇంటింటికీ నల్లా కనెక్షన్, శ్మశానవాటిక, విద్యుత్ సబ్‌స్టేషన్ ఏర్పాటుచేశారు. వీటితోపాటు గ్రామం నలుదిక్కులా వివిధ గ్రామాలను కలుపుతూ తారురోడ్లను నిర్మించారు. హరితహారంలో భాగంగా ఎవెన్యూ ప్లాంటేషన్ కింద మొక్కలు నాటారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో లక్షా రెండువేల మొక్కలు నాటి వాటి సంరక్షణ చేపట్టారు. చెరువులను అభివృద్ధిపర్చారు.
SDP-harish

పటిష్ఠ బందోబస్తు

సీఎం కేసీఆర్ సోమవారం చింతమడకలో పర్యటించనున్న నేపథ్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు. బందోబస్తును 15 సెక్టార్లుగా విభజించారు. ముగ్గురు అడిషనల్ ఎస్పీలు, ముగ్గురు ఏసీపీలు, 8 మంది డీఎస్పీలు, 32 మంది సీఐలు, 74 మంది ఎస్‌ఐలు, 64 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, 635 మంది కానిస్టేబుళ్లు, హోంగార్డులు,75 మంది మహిళా కానిస్టేబుళ్లు, మహిళా హోంగార్డులు, స్పెషల్ పార్టీ, రోప్ పార్టీస్ బీడీ టీమ్స్, డాగ్ స్కాడ్స్, సెక్యూరిటీ వింగ్, మఫ్టీ పార్టీతో కలిపి మొత్తంగా 1050 మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటుచేశారు.

ఇంటింటా తోరణాలు.. పూలదండలు

ఇంటింటా మామిడి తోరణాలు! బంతిపూల దండలు!! ఇండ్ల ముందు వెల్‌కమ్ టు సీఎం కేసీఆర్ అంటూ ముగ్గులు.. తమ ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఘనస్వాగతం పలుకడానికి సిద్ధమైన చింతమడక చిత్రమిది. దసరా, దీపావళి, ఉగాది తదితర పండుగలు జరుపుకొన్నప్పుడు ఎంత సంబురంగా ఉంటుందో ఇప్పుడు అంతకన్న ఎక్కువ సంబురంతో ఉన్నారు చింతమడక గ్రామస్థులు. సోమవారం రానున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కోసం సిద్ధమైన ఏర్పాట్లను చూసేందుకు ఆదివారం సాయంత్రం మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు, జిల్లా కలెక్టర్ పీ వెంకట్రామ్‌రెడ్డి గ్రామంలో కలియతిరిగారు. ఇండ్ల ముందు గ్రామస్థులు చేసుకున్న అలంకరణలను పరిశీలించారు. కేసీఆర్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చింతమడకలోని వారి ఇంట్లో పనిచేసే జిట్టని పోశవ్వ ఇంటికి వెళ్లి మాట్లాడారు. మీ సార్ వస్తున్నారు పోశవ్వ.. రేపు మీటింగ్‌కు రావాలని ఆహ్వానించారు.
Alpha1

రైతుబిడ్డ కేసీఆర్

సీఎం కేసీఆర్ రైతుబిడ్డ. ఎంత ఎదిగినా వ్యవసాయాన్ని మాత్రం ఏనా డూ విడిచిపెట్టలేదు. ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు, కరువు మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు సైతం చింతమడకలోనే స్వయం గా వ్యవసాయం చేశారు. రోజులో నాలుగైదు గంటలపాటు ట్రాక్టర్‌తో స్వయంగా పొలం దున్నేవారు. ఈ విషయాన్ని గ్రామస్థులు ఇప్పటికీ చెప్తున్నారు. వ్యవసాయమంటే సీఎం కేసీఆర్‌కు ఎంతో మక్కువ. అందుకే ముఖ్యమంత్రి అయినప్పటికీ నేటికి కూడా వ్యవసాయం చేస్తున్నారు. వ్యవసాయ క్షేత్రంలో ఇప్పటికీ పంటలను పర్యవేక్షిస్తుంటారు.

ఎంతో సంబురంగా ఉంది

సీఎం కేసీఆర్ చింతమడకకు రావడం ఎంతో సంబురంగా ఉంది. సీఎం సార్ వస్తున్న సంతోషంలో మా ఇండ్లను పచ్చని తోరణాలు, పూలతో అలంకరించినం. మా గ్రామ బిడ్డ నేడు రాష్ర్టాన్ని పాలిస్తుండటం సంతోషంగా ఉంది. గ్రామాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసుకుంటం. గ్రామస్థులంతా సంతోషంగా ఉన్నారు.
– మోత్కు యాదగిరి, సీఎం కేసీఆర్ దోస్త్ 

ఘనంగా స్వాగతం పలుకుతాం

కేసీఆర్ ముఖ్యమంత్రి పదవిలో ఉన్నా స్నేహితులందరితోనూ ఎంతో ఆత్మీయంగా ఉంటారు. ఆయన గ్రామానికి రావడం చాలా సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్.. నేను చిన్ననాటి నుంచి ఒకే దగ్గర ఉండి చదువుకున్నాం. గ్రామమంతా పండుగలా ఉంది. సీఎం కేసీఆర్‌కు ఘనస్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నాం.
– భైరి కిష్టారెడ్డి, సీఎం కేసీఆర్ క్లాస్‌మేట్
SDP6
SDP
SDP1
SDP2
SDP3

Source:Namasthe Telangana Desk