తెలంగాణ రాష్ట్ర స్ఫూర్తితో దేశంలో ఎక్కడైనా రేషన్ పొందేలా కేంద్రం ప్రభుత్వం అమలులోకి తీసుకురానున్న ఒకే దేశం- ఒకే కార్డు తొలి ప్రయోగం విజయవంతమయింది. వచ్చేఏడాది జూన్‌లోగా దేశవ్యాప్తంగా నేషనల్ పోర్టబిలిటీని అమలుచేయనున్న కేంద్రప్రభుత్వం.. ఆగస్టు 1నుంచి నాలుగు రాష్ర్టాల్లో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నది.
తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌ను ఒక క్లస్టర్‌గా, గుజరాత్-మహారాష్ట్రను ఒక క్లస్టర్‌గా ఏర్పాటుచేసి అమలుచేయనున్నది. ఇందులోభాగంగా గురువారం హైదరాబాద్ పంజాగుట్టలోని ఒక రేషన్‌షాపులో దేశంలోనే మొదటిసారిగా నిర్వహించిన ట్రయల్న్ విజయవంతమయింది.
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన ఈశ్వర్‌రావు, విశాఖపట్నం జిల్లా యలమంచలికి చెందిన అప్పారావు పంజాగుట్టలోని రేషన్ దుకాణం నుంచి సరుకులు తీసుకున్నారు. పోర్టబిలిటీ ట్రయల్న్ విజయవంతం కావటంపై పౌరసరఫరాలశాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ హర్షం వ్యక్తంచేశారు. సాంకేతిక సమస్యలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.