సోమవారం అర్ధరాత్రి హీరో రాజ్ తరుణ్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అయితే ప్రమాదం జరిగిన వెంటనే రాజ్ తరుణ్ అక్కడి నుంచి వెళ్లిపోయినట్టుగా సీసీ టీవీల్లో కనిపించటం తరువాత ఎలాంటి సమాచారం లేకపోవటంతో మీడియాలో రకరకాల వార్తలు వినిపించాయి. దీంతో హీరో రాజ్ తరుణ్ ప్రమాద సంఘటనపై సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చారు. ‘నేను ఎలా ఉన్నానో తెలుసుకునేందుకు చాలా మంది ఫోన్లు చేస్తున్నారు. నా మీద చూపిస్తున్న ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు. గత 3 నెలలుగా నేను ఇంటి నుంచి నార్సింగ్ సర్కిల్ మీదుగా ప్రయాణిస్తున్నాను. అక్కడ తరుచూ ప్రమాదాలు జరుగుతుంటాయి. అక్కడే సడన్‌గా రైట్ టర్న్ ఉండటంతో కారు అదుపు తప్పి పక్కనే ఉన్న గోడను ఢీ కొట్టింది. పెద్ద శబ్ధం రావటంతో షాక్‌కు గురయ్యా. సీటు బెల్టు పెట్టుకొని ఉండటంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. వెంటనే భయంతో ఏమైనా దెబ్బలు తగిలాయా లేదా చూసుకొని ఇంటికి పరిగెత్తాను. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాను. త్వరలో షూటింగ్‌కు హాజరవుతా’ అంటూ తన ట్విటర్ పేజ్‌లో మెసేజ్‌ను పోస్ట్ చేశారు.
