ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న గ్రామ సచివాలయ పరీక్షలను పారదర్శకంగా నిర్వహిస్తామని, అభ్యర్థులెవరూ ఉద్యోగాలకోసం దళారులను నమ్మొద్దని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించారు. రాష్ట్రంలో మొత్తం 5114 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. పరీక్షకు వచ్చేవారు హాల్ టికెట్‌తో పాటు ఏదైనా గుర్తింపు కార్డు ఉంటే పరీక్షా కేంద్రానికి అనుమతిస్తారని తెలిపారు. ఓఎంఆర్ షీట్లను జిల్లాలకు తరలిస్తామని, ప్రతీ జిల్లాలో స్ట్రాంగ్ రూమ్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పరీక్ష నిర్వహణ అనంతరం సమాధాన పత్రాలను నాగార్జున యూనివర్సిటీకి తరలించి అక్కడ స్కానింగ్ చేస్తారని తెలిపారు. పరీక్ష రాసే అభ్యర్థులకు ఆర్టీసీ సౌకర్యం కల్పించామన్నారు. దూరప్రాంతాలనుంచి వచ్చేవారు ముందురోజే చేరుకోవాలని ఆలస్యం కాకుండా చూసుకోవాలని పెద్దిరెడ్డి వివరించారు.
