రేపిస్టుల విషయమై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి డిమాండ్ చేశారు. షాద్‌నగర్ ఘటన కేసులో నిందితులను బహిరంగంగా ఉరి తీయాలంటూ జనం చేస్తున్న డిమాండ్ సరికాదని, రేపిస్టులను బెత్తంతో రెండు దెబ్బలు చెమ్డాలు ఊడేలా కొడితే సరిపోతుందంటూ పవన్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం సచివాలయంలో పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ.. మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా పవన్ వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని, మహిళలకు ఆయన బహిరంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దిశ కేసులో నిందితులను కఠినంగా శిక్షించకుండా కేవలం బెత్తంలో రెండు దెబ్బలు కొడితే సరిపోతుందనడం దారుణమన్నారు. ఆడపిల్లల మాన, ప్రాణలంటే నీకు అంత చులకనా అంటూ పవన్‌పై ధ్వజమెత్తారు. పవన్ కల్యాణ్ మాటలు మహిళల మనోభావాలను దెబ్బతీశాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు చేసే వారిని కఠినంగా శిక్షించేందుకు కొత్త చట్టాన్ని తీసుకువస్తామని తెలిపారు.
