Home / SLIDER / మోస్ట్‌ ఇంప్రూవ్డ్‌ రాష్ట్రంగా తెలంగాణ

మోస్ట్‌ ఇంప్రూవ్డ్‌ రాష్ట్రంగా తెలంగాణ

తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు మెరుగైన పాలన అందిస్తూ, అభివృద్ధి పథంలో సాగుతున్నదని ప్రముఖ మీడియా సంస్థ ఇండియా టుడే సంస్థ నిర్ధారించింది. సంస్థ ఇటీవల ‘స్టేట్‌ ఆఫ్‌ ది స్టేట్స్‌(ఎస్‌వోఎస్‌)-2019’ పేరుతో నిర్వహించిన సర్వేలో ఆర్థిక, పాలనా విభాగాల్లో తెలంగాణ ఉత్తమ స్థానంలో నిలిచింది.

సర్వేలో భాగంగా 35వేల చదరపు కి.మీ కన్నా ఎక్కువ వైశాల్యం, 50 లక్షలకుపైగా జనాభా కలిగిన రాష్ర్టాలను ‘పెద్ద రాష్ర్టాలు’గా, మిగతావాటిని ‘చిన్న రాష్ర్టాలు’గా విభజించింది. ఆయా రాష్ర్టాలు విడుదల చేసిన నివేదికలు, జాతీయ స్థాయిలోని సంస్థల వద్ద ఉన్న పత్రాలు, ఆయా సంస్థలకు రాష్ర్టాలపై ఉన్న అభిప్రాయాలు, ఇచ్చిన ర్యాంకులు తదితర అంశాలను సమగ్రంగా విశ్లేషించి ఈ నివేదిక రూపొందించినట్టు ఇండియా టుడే తెలిపింది. ఆర్థిక, మౌలిక, విద్య, వైద్యం, పాలన వంటి 12 విభాగాల్లో సర్వే చేసి నివేదిక విడుదల చేసింది.

ఒక్కో విభాగంలో ఉత్తమ రాష్ట్రం, పనితీరులో అనూహ్య మార్పు (మోస్ట్‌ ఇంప్రూవ్డ్‌) కనిపించిన రాష్ట్రం పేరును ప్రకటించింది. ఒక రాష్ట్రం పనితీరు గత ఐదేండ్లలో అనూహ్య రీతిలో మెరుగుపడితే మోస్ట్‌ ఇంప్రూవ్డ్‌ స్టేట్‌గా పరిగణించారు. ఆర్థిక విభాగంలో పెద్ద రాష్ర్టాల్లో తెలంగాణ రెండో స్థానంలో నిలిచి సత్తా చాటింది.

గుజరాత్‌ ఉత్తమ రాష్ట్రంగా నిలిచింది. గత ఏడాది ఇదే విభాగంలో తెలంగాణ ఆరోస్థానంలో ఉండగా.. ఈ సారి ఏకంగా నాలుగు స్థానాలు పైకి ఎగబాకింది. తలసరి ఆదాయం, దారిద్య్రరేఖకు ఎగువన ఉన్నవారి సంఖ్య, జీఎస్‌డీపీ, వినియోగదారుల ధరల సూచీ, నిరుద్యోగిత శాతం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని ర్యాంకులు ఇచ్చారు. పాలనను మెరుగుపరుచుకునే అంశంలో తెలంగాణ వరుసగా రెండో ఏడాది ‘మోస్ట్‌ ఇంప్రూవ్డ్‌ స్టేట్‌’గా నిలిచింది.