తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ఇరవై రెండో తారీఖున జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న శనివారం వేములవాడ, సిరిసిల్ల పట్టణాల్లో నిర్వహించిన రోడ్‌షోలలో పాల్గొన్న మంత్రి కేటీఆర్‌కు మహిళలు.. బోనాలు, బతుకమ్మలు, మంగళహారతులతో ఘనస్వాగతం పలికారు. రోడ్‌షోకు స్థానిక ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. జై కేటీఆర్ అంటూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ”కేంద్రంలో 70 ఏండ్లనుంచి పాలించిన కాంగ్రెస్, బీజేపీలు చేయని అభివృద్ధిని రాష్ట్రంలో కేవలం ఐదేండ్లలో చేసి చూపించామని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలకశాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. రాష్ర్టాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేశామని, మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటువేసి ఆశీర్వదించాలని కోరారు. కారుగుర్తుకు ఓటేస్తే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, తనకు వేసినట్టేనని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు టీఆర్‌ఎస్ పార్టీకే ఉన్నదని, ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేస్తామన్నారు.
ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. రాష్ట్ర ప్రభుత్వం అన్నివర్గాల సంక్షేమం కోసం పనిచేస్తున్నది. గత ప్రభుత్వాలు పేదలకు రూ.200 పింఛన్లు ఇస్తే టీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 40 లక్షల మందికి రూ.2,016, దివ్యాంగులకు రూ.3,016 చొప్పున ఇస్తున్నది. పీఎఫ్ లేకున్నా దేశంలో ఎక్కడా లేనివిధంగా బీడీ కార్మికులకు పింఛను ఇస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్‌ఎస్సే. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్ కిట్లు, కిడ్నీ బాధితులకు డయాలసిస్ కేంద్రాలు..ఇలా అనేక పథకాలు ప్రవేశపెట్టిన ఏకైక రాష్ట్రం తెలంగాణే. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ఊసేలేదు. బీజేపీ వాళ్లది బిల్డప్ ఎక్కువ.. పని తక్కువ. వారు ఓటు కోసం వస్తే ఏం చేశారని నిలదీయండి అని పిలుపునిచ్చారు.