తెలంగాణ వ్యాప్తంగా గత ఐదు రోజుల నుండి పట్టణ ప్రగతి కార్యక్రమం జోరుగా కొనసాగుతుంది. పట్టణ ప్రగతి కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు పట్టణాల్లో,మున్సిపాలిటీల్లో స్థానిక ఎమ్మెల్యేలు,ఎంపీలు,ఎమ్మెల్సీలు,మంత్రులు,ప్రజాప్రతినిధులు,అధికారులు పాల్గొంటున్నారు.
పట్టణాల్లోని మురుగు కాలువలను పరిశుభ్రం చేయడమే కాకుండా పిచ్చి మొక్కలను తొలగించే పనిలో నిమగ్నమవుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఈనెల 24న మంత్రి సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని 8వ వార్డులో పర్యటించారు.
నారాయణరెడ్డి కాలనీలో ఇండ్లపైనుంచి వెళ్తున్న 33 కేవీ, 11 కేవీ విద్యుత్ తీగలను తొలగించాలని స్థానికులు మంత్రి హారీష్ రావుకు విన్నవించారు. వెంటనే స్పందించిన మంత్రి హారీష్ రావు ఆ సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. దీంతో నిన్న శుక్రవారం నారాయణరెడ్డి కాలనీకి వెళ్లిన అధికారులు విద్యుత్ తీగలను సరిచేసే పనులను ప్రారంభించారు.