Home / EDITORIAL / ఉన్మాద ఆంధ్ర మీడియాకి ప్రతీక ఆర్కే

ఉన్మాద ఆంధ్ర మీడియాకి ప్రతీక ఆర్కే

 

‘నాకు దక్కనిది ఎవ్వరికీ దక్కనియ్యను’ అని ఉన్మాద ప్రేమికుడు తన ప్రేయసిని చంపడం లేక యాసిడ్‌ పోయడం వంటి చర్యలను సినిమాల్లో, నిజ జీవితంలో చూస్తూ ఉంటాం. సరిగ్గా ఇలాంటి దుర్మార్గ ఆలోచనే ఇప్పుడు ఆంధ్రా ఆధిపత్యవాదంతో ఉండే నాయకగణం, వారి అనుంగు మీడియా చేస్తున్నది. తెలంగాణపై, ముఖ్యంగా దేశంలోని అతిపెద్ద నగరాల్లో ఐదవది అయిన హైదరాబాద్‌పై అక్కసునంతా వెళ్లగక్కుతూ విషప్రచారానికి ఒడిగడుతున్నది.

తెలంగాణ సాధన కోసం పోరాటం జరుగుతున్నప్పుడు విషప్రచారంతో ఆ పోరాటాన్ని తప్పుపడుతూ, రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ తెర్లు అవుతుందని, ఒక రాష్ట్రంగా మనజాలదనీ కపట సిద్ధాంతాలు వండివార్చారు. పాలన చేతకాక ప్రజలను నిట్టనిలువునా ముంచుతారని, ప్రజలు మోసపోవద్దని మొసలి కన్నీరుకారుస్తూ పడరాని పాట్లుపడ్డారు. తీరా రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం కాగానే అభివృద్ధికి గుండెకాయగా ఉన్న హైదరాబాద్‌పై తమ భల్లూకపు పట్టు సడలిపోకుండా కుతంత్రాలకు పాల్పడ్డారు. అంతచేసీ హైదరాబాద్‌.. తెలంగాణకే దక్కేసరికి జీర్ణించుకోలేని కొన్ని మీడియావర్గాలు ఆరేండ్లుగా హైదరాబాద్‌పై, తెలంగాణపై విషం కక్కుతూనే ఉన్నాయి. హైదరాబాద్‌లో ఉండేదంతా సీమాంధ్రులేనని, వారు వెళ్లిపోతే నగరం ఖాళీ అవుతుందని, అభివృద్ధి కుంటుపడుతుందని చెప్పుకొచ్చాయి.

అవీ తప్పుడువాదనలేనని తేలిపోయింది. మినీ ఇండియాగా, దేశం నలుమూలల నుంచి వచ్చినవారికి నీడనిచ్చే వనరుగా స్థిరపడేసరికి హైదరాబాద్‌పై అవకాశం దొరికినప్పుడల్లా విషం గక్కుతున్నారు. ఇప్పుడు వారికి కరోనా దొరికింది. హైదరాబాద్‌లో వైరస్‌ విజృంభిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదనీ, మరణాలను తక్కువచేసి చూపున్నదంటూ విషప్రచారపు వార్తలను వండి వార్చుతున్నారు.నిజానికి వాస్తవాలు వేరుగా ఉన్నాయి. కరోనా రికవరీ రేటులో దేశంలో తెలంగాణది రెండో స్థానం. మరణాల రేటు అతి తక్కువ. కానీ.. తెలంగాణ ప్రజలను భయబ్రాంతులకు గురిచేయటానికి ఆంధ్రా మీడియా అదే పనిగా కుట్రపూరిత వార్తలను ప్రచారంలో పెడుతున్నది. హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ను దెబ్బ తీయటానికి విఫలయత్నంగా ఈ కథనాలను భావించాల్సి ఉంటుంది.

హైదరాబాద్‌లోని ప్రభుత్వ, ప్రైవేట్‌ దవాఖానాల్లో వేలమంది ఆంధ్ర, కర్ణాటక నుంచి వచ్చి చికిత్స చేయించుకుంటున్నారు. ఏపీ మంత్రి, పార్లమెంటరీ పార్టీనేత, ఆ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుని బంధుమిత్రులు, విపక్షాల నేతలూ హైదరాబాద్‌లోనే కరోనాకు చికిత్స పొందుతున్నారు. నిజంగా ఇక్కడ కరోనా విలయతాండవం చేస్తుంటే సరిహద్దు రాష్ర్టాల నుంచి వచ్చి ఇక్కడ చికిత్స ఎందుకు పొందుతున్నారో వారే చెప్పాలి. ఇది చాలు హైదరాబాద్‌లో, తెలంగాణలో పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయని చెప్పడానికి. తెలంగాణలో రోజుకు వెయ్యిమరణాల సగటు ఉంటుంది. కరోనా సమయంలోనూ సుమారు అంతే ఉన్నదని మరణ ధ్రువీకరణ గణాంకాలు పేర్కొంటున్నాయి. హైదరాబాద్‌లో ఉన్న అన్ని హాస్పిటళ్లలో రోజుకు 400 నుంచి 600 మరణాలు సంభవిస్తాయి.

మరణించిన వ్యక్తి బంధువులు ఆ మృతదేహాలను ఉరికి తీసుకెళ్లి దహన సంస్కారాలు చేసుకునేవారు. కానీ కరోనా పరిస్థితుల్లో ఇప్పుడు అది చేయటంలేదు. ఏ ప్రాం తంవారైనా, ఏ కారణం చేత హైదరాబాద్‌లో చనిపోయినా దహనసంస్కారాలు హైదరాబాద్‌లోనే జరుగుతున్నాయి అనేసత్యాన్ని గ్రహించలేని స్థితిలో మీడియా సంస్థలు ఉన్నా యా? ప్రజలంతా తీవ్ర భయాందోళనలు, మానసిక ఒత్తిడితో ఉన్న సమయంలో అనవసర భయోత్పాతాన్ని ఎవ్వరూ కలిగించకుండా బాధ్యతగా వ్యవహరించాలి. కానీ ఆంధ్రామీడియా మాత్రం కనీస మానవీయ కోణాన్ని మరిచి తప్పుడు వార్తలు ప్రచారంలో పెట్టడం తీవ్ర ఆక్షేపణీయం.

ఆంధ్రా దోపిడీదారుల మానస పుత్రికలైన కొన్ని మీడియా సంస్థలు అదే పనిగా తెలంగాణ వ్యతిరేక ప్రచారాన్ని చేస్తూనే ఉండటం గమనార్హం. తాము సమర్థించే నాయకుడు ఇక్కడి ప్రభుత్వాన్ని 2018లో కులదోసే కుట్రచేశారు. తద్వారా హైదరాబాద్‌లో తమ ఆధిపత్యాన్ని తిరిగి పొందగలమని ఆశించారు. తెలంగాణ ప్రజలు ఆ కుట్రలన్నింటినీ తిప్పికొట్టి, భారీ మెజారిటీతో టీఆర్‌ఎస్‌కు అధికారం కట్టబెట్టారు. 2019లో తాము సమర్థించేపార్టీ ఆంధ్రాలో అధికారం కోల్పోవడంతోపాటు తమఆశల సౌధంగా, కామధేనువుగా పనికొస్తుందని అనుకున్న కొత్త రాజధాని కలలు కల్లలయ్యా యి. దీంతో ఆంధ్రా మీడియా సంస్థలు హైదరాబాద్‌పై తమ అక్కసును వండి వార్చుతున్నట్లు అవగతం అవుతున్నది.

మనగడమే కష్టమని భావించిన తెలంగాణ ఇవాళ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో దేశానికే ఆదర్శంగా నిలువటం ఆంధ్రా పెత్తందారులకు మింగుడుపడటం లేదు. ఆబాలగోపాలం మన్ననలను పొందుతూ కేసీఆర్‌ పాలన సాగుతుండటంతో సీమాంధ్ర మీడియా దిక్కుతోచని స్థితిలో పడిపోయి మరిన్ని కుట్రపూరిత విషప్రచారాలు మొదలుపెట్టింది. ఆ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వంపై, హైదరాబాద్‌పై దాడికి పూనుకొంటున్నాయి. కరోనా వంటి ప్రపంచవిపత్తు సమయంలోనూ శవ రాజకీయాలకు తెరలేపాయి. విపత్కర పరిస్థితిలోనూ కపట రాజకీయాలకు పాల్పడుతున్న మీడియాను, సీమాంధ్ర ఆధిపత్యవాదుల కుట్రలను తెలంగాణ ప్రజానీకం తమదైన ఉద్యమ చైతన్యంతో అర్థం చేసుకుంటారు. సీమాంధ్ర వలసవాద కుట్రలను ఓడిం చి తీరుతారు. అభివృద్ధి సంక్షేమ పాలనకు బాసటగా నిలుస్తారు.

– పెండ్యాల మంగళాదేవి