Home / EDITORIAL / అబద్ధాలకోరు..ఆర్కే..!

అబద్ధాలకోరు..ఆర్కే..!

తెలంగాణ ఉద్యమం నడిచినంతకాలం రాష్ట్రం రాదంటూ.. అసలు సాధ్యమే కాదంటూ లాజిక్‌కు కూడా అందని పిచ్చిరాతలు.. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రం ఇవ్వదు.. ప్యాకేజీ గురించి ఆలోచిస్తున్నదన్నాడు.. కేంద్రం తీర్మానాన్ని అసెంబ్లీ తిరస్కరించాక ఇచ్చే ప్రశ్నేలేదనీ రాశాడు.. 371 అధికరణానికి రాజ్యాంగ సవరణచేయకుండా రాష్ట్ర విభజన దుస్సాధ్యమన్నాడు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అబద్ధాల, దగాకోరు రాతలకు తెలంగాణ బిడ్డలు ధైర్యం కోల్పోయి బలయ్యారు.. కానీ రాష్ట్ర విభజన ఆగలేదు. 

మురికిగుంట నుంచి ముత్యమైనా తీయవచ్చేమో కానీ.. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మాత్రం నిజం రాస్తాడని  ఏ కొంచెమైనా ఆశించలేము. అబద్ధానికి అంగీలాగూ తొడిగితే అది రాధాకృష్ణ అవుతుంది. తెలంగాణ ఉద్యమం మొదలుకొని.. ఇప్పటిదాకా ఈ ప్రాంతంపైనా.. ఇక్కడి మనుషులపైనా.. పాలకులపైనా ఎక్కడలేని విద్వేషం.. ఓర్వలేనితనం.. వారానికో కొత్త అబద్ధపు పలుకు.

తెలంగాణ సమాజంలో స్వరాష్ట్రంపైనా, స్వపరిపాలనపైనా విశ్వసనీయత పోగొట్టేందుకు విషం చిమ్మేరాతలు.. పుట్టు అబద్ధాలు.. దగాకోరు మాటలు.. కట్టుకథలు.. పిట్టకథలు.. ఏ ఒక్క అక్షరంలోనూ నీతి లేదు.. నిజాయితీ లేదు. నిజం అస్సలే లేదు. దశాబ్దానికి పైగా గడచిన కాలంలో రాధాకృష్ణ తెలంగాణపై పేలని అవాకులు లేవు.. చవాకులు లేవు. ప్రతిమాటా తెలంగాణ ధ్వంస రచనే.   

2014 ఏప్రిల్‌, 27 కొత్తపలుకు

ఇంతకీ తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి కావాలన్న కేసీఆర్‌ కల నెరవేరుతుందా? లేదా? అన్నది ఇప్పుడే చెప్పలేం. ఎందుకంటే ప్రస్తుత అంచనాల ప్రకారం తెలంగాణలో హంగ్‌ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. తెలంగాణ తరఫున స్టార్‌ క్యాంపెయినర్‌గా కేసీఆర్‌ పది జిల్లాలను చుట్టివేస్తున్నప్పటికీ ఆ పార్టీకి క్షేత్రస్థాయిలో సంస్థాగత బలం అంతంత మాత్రమే. కాంగ్రెస్‌  టీఆర్‌ఎస్‌కు చెరో 45 స్థానాలు లభించవచ్చని అంచనా వేస్తున్నారు.

ఇదీ వాస్తవం

2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆర్కే మార్క్‌ చెత్త పలుకు ఇది. ఉద్యమమే కాదు.. తెలంగాణ సాకారం అవుతున్న సమయంలోనూ తెలంగాణ, కేసీఆర్‌పై వ్యక్తిగతంగా అక్షర దాడులు చేయడమనేది రాధాకృష్ణకు ప్యాకేజీల పండుగను తెచ్చిపెట్టేదే. అందుకే 2014 ఎన్నికల్లో 45 స్థానాలకే టీఆర్‌ఎస్‌ పరిమితమై.. తన పచ్చ స్నేహితుడు చంద్రబాబు కింగ్‌మేకర్‌ అవుతాడని కలలుగన్నాడు. కానీ తెలంగాణ ప్రజలు చెంప పెట్టులా కేసీఆర్‌కు ఏకపక్ష తీర్పునిచ్చి సీఎం కుర్చీలో కూర్చోబెట్టారు. 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ:  రాష్ట్రం వచ్చిన తర్వాత.. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అనుకున్నవేమీ జరుగకుండా పోతున్నవనే అక్కసు వారంవారం కనిపిస్తూనే ఉన్నది. ఇక్కడి అభివృద్ధి వేగాన్ని చూసి.. ఊహించని విధంగా సాగుతున్న సంక్షేమాన్నిచూసి ఎంతమాత్రం భరించలేని నైజం. పత్రికాస్వేచ్ఛ, మీడియా స్వాతంత్య్రం పేరుతో అణువణువునా తెలంగాణ వ్యతిరేక ఎజెండా. విద్యుత్‌ ఉండదన్నాడు, పరిశ్రమలు ఉన్నయి పోతాయన్నాడు.. కొత్తవి రావన్నాడు, మెట్రో కాదన్నాడు, ఖజానా ఖాళీ అన్నాడు.. రాధాకృష్ణ మనసులో కోరుకున్నట్టు తెలంగాణ ఎవరిమీదా ఆధారపడలేదు. అడుక్కుతినడం లేదు.

కేంద్రం నిధులు ఇవ్వకపోయినా తన కాళ్లమీద తాను నిలబడి దేశంలోని అన్ని రాష్ర్టాల కంటే కూడా మిన్నగా పురోగామియై దూసుకుపోతున్నది.  తాజాగా కరోనా పరీక్షలు, మృతుల అంత్యక్రియలు, కట్టడి చర్యలపైనా వికృతరాతలు. హైదరాబాద్‌లో మామూలుగానే రోజూ 120 నుంచి 150 మరణాలు అవుతుంటాయి. అందులో కొన్ని కొవిడ్‌ మరణాలుంటాయి. అనుమానిత మరణాలుంటాయి.. ఈ విషయాలన్నీ అందరికీ తెలిసిందే. ఇవాళ ఈయనే కొత్తగా కనుక్కొన్నట్టు బొమ్మల బాగోతం రచించాడు. కరోనా అనుమానం ఉంటేనే భయపడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఒక కరోనా మృతి.. అనుమానంతో అయినా జరిగితే గగ్గోలు పుట్టకుండా ఉంటుందా? ఈ మాత్రం లాజిక్‌ను రాధాకృష్ణ ఎట్లా మిస్సయ్యాడో అర్థంకాదు. ఆరోగ్యరంగంలో  దేశంలోనే మూడోస్థానంలో ఉన్నది తెలంగాణ అన్న విషయాన్ని రాధాకృష్ణ కన్వీనియంట్‌గానే మరిచిపోయాడు.

ఢిల్లీ వంటి చోట్ల డేరాలు వేసుకొని తాత్కాలిక వైద్యశాలలు నడిపిస్తుంటే.. తెలంగాణ మాత్రం ఏకంగా టిమ్స్‌ వైద్యశాలను పూర్తిస్థాయి సౌకర్యాలతో సిద్ధంచేసిన విషయాన్నీ వదిలేశాడు. చివరకు శవాలమీద పేలాలేరుకొంటున్నాడు. రాధాకృష్ణ అబద్ధాల పలుకులు తెలంగాణ సమాజానికి కొత్తవేం కావు. దశాబ్దం నుంచి అవే అబద్ధాలు.. తాను రాసినవి తప్పని తర్వాతి కాలంలో తప్పని తేలిపోయినా నిస్సిగ్గుగా కొనసాగిస్తున్న మురుగుమాటలు. అలాంటి చెత్త పలుకుల్లో మచ్చుకు కొన్ని..

2013, జూన్‌ 16 కొత్త పలుకు

‘తెలంగాణ ఉద్యమం డీలా పడుతుందా? చలో అసెంబ్లీ కార్యక్రమం హింసాత్మకంగా మారి ఉంటే తన పదవికే ప్రమాదం ముంచుకు వస్తుందని తెలిసి కూడా ముఖ్యమంత్రి మొండిగా వ్యవహరించడం ఆయన కోణంలో సరైనదే! రాజశేఖర్‌రెడ్డి మరణానంతరం కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి అయి ఉంటే 2009 డిసెంబరు తొమ్మిది నాటి ప్రకటన వెలువడి ఉండేది కాదన్న వ్యాఖ్య రాజకీయవర్గాల్లోనే కాదు పాత్రికేయ వర్గాల్లో కూడా విస్తృతంగా వినిపించింది. ప్రస్తుతం కాంగ్రెస్‌ పెద్దల ఆలోచన అంతా ప్రత్యేక ప్యాకేజీ చుట్టే తిరుగుతున్నది. సమస్య పరిష్కారంలో భాగంగా తెలంగాణ అభివృద్ధికి, నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలన్న నిర్ణయానికి కాంగ్రెస్‌ పెద్దలు వచ్చారన్నది సమాచారం. ప్యాకేజీ ప్రకటన తర్వాత నిరసన స్వరాలు వినిపించినా పరిస్థితిని ఎదుర్కోవడానికి చలో అసెంబ్లీ కట్టడిని ట్రయల్‌గా ఉపయోగించుకున్నట్లు కనిపిస్తున్నది.’

వాస్తవం ఇదీ

కాంగ్రెస్‌ నిజంగా ఆ ఆలోచన చేసిందా? చేస్తే రాధాకృష్ణకు వచ్చి చెప్పిందా? రాధాకృష్ణ జూన్‌ 16న ప్యాకేజీ పాట పాడితే.. జూలై 30న కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలన్న తీర్మానాన్ని ఆమోదించింది. ఆ తర్వాత ఏమైందో అందరికీ తెలిసిందే కదా. ప్యాకేజీ ప్రకటనలంటూ అబద్ధాలకు అక్షర రూపాన్నిచ్చి రాధాకృష్ణ ఎంతోమంది అమాయక తెలంగాణ బిడ్డల చావులకు కారణమయ్యాడు.

2014, ఆగస్టు 3 – కొత్త పలుకు

గత నెలలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశం తర్వాత 43 నిర్ణయాలు తీసుకున్నామంటూ తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఇందులో ప్రజలకు నేరుగా ప్రయోజనం చేకూరే ఒక్క నిర్ణయం కూడా ఇంతవరకు అమలు కాలేదు. బారెడు చెప్పి మూరెడు చేయడం అలవాటుగా చేసుకున్నారు. పోలీసులకు ఇన్నోవా వాహనాలు, కల్యాణ లక్ష్మి పథకం కింద రూ.50వేలు ఇస్తామన్నారు.

వాస్తవం ఇదీ

ఆ మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకే 2009  నుంచి రైతులకు పెండింగులో ఉన్న రూ.480.43 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీని ప్రభుత్వం అందించింది. 12.64 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరింది. పోలీసు లాఠీ దెబ్బలు తప్ప ఎర్రజొన్న రైతులను కనికరించకుండా ఉమ్మడి పాలకులు పెండింగులో పెట్టిన రూ.9.50 కోట్ల బకాయిల్ని నిజామాబాద్‌ జిల్లా ఎర్రజొన్న రైతులకు చెల్లించినదీ ఈ మంత్రివర్గ సమావేశంలోని నిర్ణయం ప్రకారమే. ఏ రాష్ట్ర చరిత్రలోలేని విధంగా తెలంగాణలో ప్రతి పోలీస్‌ స్టేషన్‌కు ఇన్నోవా వాహనాన్ని ఇచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిది. ఇక.. కల్యాణ లక్ష్మి పథకం ఎన్నో విప్లవాత్మక మార్పులకు నాంది పలికింది. రూ.50 వేల ఆర్థిక సాయంతో మొదలైన ఈ పథకం ఇప్పుడు లక్ష నూటపదహారు రూపాయలకు పెంచారు.

2014 ఆగస్టు, 10 కొత్త పలుకు

తెలంగాణ రైతులది ఎప్పుడూ దుర్భర పరిస్థితే. దానికి తోడు రాష్ట్ర విభజన వల్ల తెలంగాణ రాష్ట్రం తీవ్ర విద్యుత్‌ సంక్షోభంలో కూరుకుపోయింది. విభజన తర్వాత తెలంగాణకు కరెంటు కష్టాలు వస్తాయని చెప్పిన వారిపై గతంలో కేసీఆర్‌ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణకు మధ్య నది మాత్రమే అడ్డం ఉన్నదని, రెండున్నర నెలల్లో లైన్లు వేసుకొని కరెంటు తెచ్చుకుంటామని చెప్పారు. చివరకు అది సాధ్యం కాదని ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలోని మంత్రులే అంగీకరిస్తున్నారు. వర్షాకాలంలోనే పరిస్థితి ఇలా ఉంటే ఎండాకాలంలో మాటేమిటి అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కేంద్రం సహకారం లేకుండా విద్యుత్‌ గండం నుంచి తెలంగాణ రాష్ట్రం గట్టెక్కగలదా? తెలంగాణలో విద్యుత్‌ కొరత తీవ్రంగా ఉన్నపుడు ప్రభుత్వం ఏమి చేయాలి? ఏపీ ప్రభుత్వాన్ని సంప్రదించి ప్లాంట్ల మరమ్మతు పనులను వాయిదా వేసుకోవాలని కోరాలి కదా!

వాస్తవం ఇదీ

కేంద్రం, ఆంధ్రప్రదేశ్‌ దయాదాక్షిణ్యాలపై ఆధారపడి తెలంగాణ కరెంటు సమస్యను అధిగమించలేదు. సీఎం కేసీఆర్‌ తన మెదడును కరగదీసి.. చరిత్రలో ఎన్నడూలేని విధంగా తెలంగాణలో రికార్డు స్థాయి కరెంటు సరఫరాను కొనసాగిస్తున్నారు. సమైక్య పాలకుల నుంచి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణలాంటి వాళ్ల వరకు పిల్లి శాపనార్ధాలు ఎన్ని పెట్టినా.. చీకట్లను చీల్చుకుంటూ తెలంగాణ ఇప్పుడు 24 గంటల విద్యుత్‌ శోభతో వెలిగిపోతున్న .

2014, ఆగస్టు 17

హైదరాబాద్‌లో శాంతి భద్రతల పరిరక్షణ అంశాన్ని గవర్నర్‌కు అప్పగించడం ప్రస్తుతం అత్యంత వివాదాస్పదంగా మారింది. ఈ చట్టం పార్లమెంటు ఆమోదం పొందినపుడు టీఆర్‌ఎస్‌ సభ్యులతోపాటు కాంగ్రెస్‌ సభ్యులు కూడా ఉభయ సభల్లో ఉన్నారు. అయినా ఏనాడూ అభ్యంతరం చెప్పలేదు. హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఉన్నంతవరకు తెలంగాణకు ఇటువంటి సమస్యలు తప్పవు. హైదరాబాద్‌లో సీమాంధ్రుల సంఖ్య గణనీయంగా ఉన్నందునే ఇటువంటి జాగ్రత్తలు తీసుకుని ఉండవచ్చు.

వాస్తవం ఇదీ

హైదరాబాద్‌లో శాంతిభద్రతలు గవర్నర్‌కు అప్పగించారు. తెలంగాణలోని మిగిలిన జిల్లాల్లోనే తెలంగాణ ప్రభుత్వం శాంతిభద్రతలు చూసుకోవాలి.

సెక్షన్‌-8 అంటే ఇదేనంటూ నరంలేని నాలుకలా అనేకసార్లు చెత్త పలుకులు పలికాడు. కానీ ఏ ఒక్కనాడూ గవర్నర్‌ హైదరాబాద్‌ శాంతిభద్రతల్లో కల్పించుకున్నదీ లేదు. అసలు ఆ అవసరం రాలేదు. ఉమ్మడి రాష్ట్రంలో నిత్యం మత కలహాలు, కర్ఫ్యూలతో ఉండే నగరంలో రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అలాంటివే కాదు.. సీమాంధ్రకు చెందిన ఒక్క వ్యక్తిపైనా దాడి జరిగిందనే ఘటన చోటుచేసుకోకపోవడం రాధాకృష్ణలాంటి వాళ్లు జీర్ణించుకోలేని కఠోర సత్యం.

2014 అక్టోబరు, 12

మూడేండ్లలో తెలంగాణలో రైతులకు 24 గంటల పాటు విద్యుత్‌ ఇస్తామంటూ అసాధ్యపు హామీలు ఇవ్వడం వల్ల ప్రయోజనం ఏమిటి? మెట్రోరైలుతో పాటు అమలులో ఉన్న ఎత్తిపోతల పథకాలన్నీ పూర్తయితే తెలంగాణకు ఎన్ని వేల మెగావాట్ల విద్యుత్‌ కావాలో ఎవరైనా అంచనా వేశారా? కేవలం సెంటిమెంట్‌ ఆధారంగా ప్రజలను ఎంతో కాలం రంజింపజేయలేరు. మభ్యపెట్టలేరు.

వాస్తవం ఇదీ

చీకట్లో మగ్గిపోతుందని సమైక్య పాలకులు సంబరపడిన తెలంగాణలో 2017 జూలై నుంచి వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ సరఫరా ప్రయోగాత్మకంగా మొదలైంది. 2018 జనవరి ఒకటో తేదీ అర్ధరాత్రి నుంచి దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయానికి 24 గంటలపాటు కరెంటు సరఫరా నిర్విరామంగా కొనసాగుతున్నది.

2014 అక్టోబరు, 12

తాను ఇప్పుడు ఒక రాష్ర్టానికి ముఖ్యమంత్రినన్న వాస్తవాన్ని కేసీఆర్‌ ఎంత త్వరగా గుర్తిస్తే తెలంగాణకు అంత మంచిది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేవారికి రెడ్‌ కార్పెట్‌ పరుస్తామని చెప్పడం వరకు బాగానే ఉంది. మూడేండ్ల్ల వరకు తెలంగాణలో విద్యుత్‌ కోతలు తప్పవని ముఖ్యమంత్రి చెప్తున్నపుడు పరిశ్రమలు పెట్టడానికి ఎవరు మాత్రం ముందుకు వస్తారు?

వాస్తవం ఇదీ

తెలంగాణ ఏర్పడిన తర్వాత పారిశ్రామిక పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామంగా మారింది. జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌, ఐటీసీ, వెల్‌స్పన్‌, టాటా ఏరో స్పేస్‌, నోవార్టీస్‌.. ఐటీ రంగంలో గూగుల్‌, అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌, ఫేస్‌బుక్‌ ఇలా ఒకటేమిటి! అనేక అంతర్జాతీయం ప్రముఖ కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. ఇప్పటివరకు తెలంగాణలో రూ.రెండు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రాగా.. పదమూడు లక్షల మందికి పైగా ఉపాధి అవకాశాలు లభించాయి. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న టీఎస్‌ఐపాస్‌ దేశానికే ఆదర్శంగా నిలిచింది.

2015 సెప్టెంబరు, 6

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలిచేందుకు వేల కోట్ల రూపాయలతో ఆకాశమార్గాలు నిర్మిస్తామని చెప్తున్న సీఎం కేసీఆర్‌కు రైతులను ఆదుకునే విషయంలో చేతులు మాత్రం ఎందుకు రావడం లేదో తెలియదు. బంగారు తెలంగాణ సాధించాలని సీఎం కేసీఆర్‌కు ఉన్నట్టుగానే ఆయన సాధించే బంగారు తెలంగాణను చూడాలని రైతులకు కూడా కోరిక ఉంటుంది కదా? అలాంటి రైతులు అర్థాంతరంగా ఉసురు తీసుకోకుండా నిలువరించవలసిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉండదా?

వాస్తవం ఇదీ

అసలు రైతును ఆదుకుంటున్న సర్కారు ఏదైనా ఉన్నదంటే అది దేశంలో తెలంగాణ ముందు వరుసలో ఉందనేది జగమెరిగిన సత్యం. ఒకవైపు సాగునీటి ప్రాజెక్టులు మరోవైపు ఎరువులు, విత్తనాల్ని అందుబాటులో ఉంచడం, 24 గంటల విద్యుత్‌ సరఫరా, ఆరేండ్లలో రెండు పర్యాయాలు రుణమాఫీ, దేశానికే ఆదర్శంగా నిలిచిన రైతుబంధు, ఏ రాష్ట్ర ప్రభుత్వం కలలో ఊహించని రైతు బీమా ఇలా ఒకటేమిటి! రైతును కంటికి రెప్పలా కాపాడుకుంటున్న సర్కారు ఇది.

8.2.2015

చెరువుల పునరుద్ధరణ, వాటర్‌ గ్రిడ్‌, గోదావరిలోకి వానకాలంలో వచ్చే నీటిని తోడిపోసి సాగునీరు అందించాలనే ప్రాజెక్టులకు రూ.80వేల కోట్ల దాకా ఖర్చవుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో రూ.60 వేల కోట్లతో అప్పటి సీఎం వైఎస్‌ ప్రారంభించిన జలయజ్ఞం పదేండ్లు గడిచినా సగం కూడా పూర్తి కాలేదు. నాలుగేండ్లలో వాటర్‌గ్రిడ్‌ను పూర్తి చేయాలంటే ఏటా ఏడున్నర కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. ఏ ధీమాతో సీఎం కేసీఆర్‌ ఈ పథకాలకు పూనుకుంటున్నారు?

వాస్తవం ఇదీ

తెలంగాణ సీఎం కేసీఆర్‌ తలపెట్టిన వాటర్‌ గ్రిడ్‌ (మిషన్‌ భగీరథ) నాలుగేండ్లలోనే పూర్తయి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు ప్రతి ఇంటికీ నల్లాల ద్వారా సురక్షితమైన మంచినీరు అందుతున్నది. గత వేసవిలో ఏ ఒక్క చోట కూడా తాగునీటి ఇబ్బందులతో మహిళలు బిందెలు పట్టుకున్న దృశ్యాలు లేవు. కేంద్ర ప్రభుత్వంతో పాటు అనేక రాష్ర్టాలు ఈ పథకాన్ని ఆదర్శంగా తీసుకొని తమ రాష్ర్టాల్లో అమలుచేస్తున్నాయి.

23.8.2015

హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పుంజుకోకపోవడానికి.. అక్కడ పెట్టుబడులు పెట్టడానికి సీమాంధ్రులు సుముఖత చూపకపోవడమే కారణం. ఈ రంగంలో ఇబ్బడిముబ్బడి పెట్టుబడులు పెట్టే స్థోమ త తెలంగాణ వారికి లేదు. ఉత్తరాది వారికి సొంత ఇల్లు అనేది చివరి ప్రాధాన్యం. తమ పిల్లల పేరిటే కాకుండా వారికి పుట్టబోయే వారి కోసం కూడా ఇళ్ల స్థలాలు, ప్లాట్‌లు కొని పెట్టుకునే సంస్కృతి సీమాంధ్ర ప్రజలకే సొంతం. దీంతో హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు చాలా ఇబ్బందిపడుతున్నారు.

వాస్తవం ఇదీ

చెరపకురా.. చెడేవు అంటారు! ఆంధ్రజ్యోతి రాధాకృష్ణది కూడా ఇదే పద్ధతి. చంద్రబాబు హయాంలో అట్టపెట్టెల, గ్రాఫిక్స్‌తో కూడుకున్న అమరావతిని ప్రమోట్‌చేసేందుకు హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగంపై నిత్యం విషం చిమ్మాడు. సీమాంధ్ర ప్రజలు ఇక్కడ ఆస్తులు అమ్ముకొని అక్కడికి వెళ్లేందుకు ఇలాంటి చీప్‌ ట్రిక్స్‌, సెంటిమెంటు గేమ్‌లు ఆడాడు. కానీ చివరికి ఏమైంది?! హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగం మూడు పూవులు ఆరు కాయలుగా వర్ధిల్లుతున్నది.

02.12.2018 కొత్త పలుకు

కారు కింది నేల కదులుతున్నది. రెండు నెలల కిందట బలంగా ఉన్న టీఆర్‌ఎస్‌ ఇప్పుడు వ్యతిరేకతను ఎదుర్కొంటుంది. ఇప్పుడు ఆ పార్టీ మరింత బలహీనపడుతున్నదని, అధికార పార్టీపై వ్యతిరేకత పెరుగుతోందనీ తాజా సర్వేల్లో స్పష్టమవుతోంది. అధికారపార్టీపై వ్యతిరేకత ఎక్కడో ఒక దగ్గర ఆగిపోవాలి. అలా కాకుండా పరిస్థితి నానాటికీ దిగజారుతూ వస్తే ఫలితాలు ప్రతికూలంగానే ఉంటాయి. కేసీఆర్‌ అండ్‌ కో ఇప్పటికైనా నేల మీదకు దిగి వాస్తవ దృక్పథంలోకి రావాలి. ఈ ఎన్నికల్లో ఇండిపెండెంట్లు అధిక సంఖ్యలో గెలవబోతున్నారన్న ఎన్నికల ఫలితాలను ముందుగానే విశ్లేషించి చెప్పగల నేర్పరితనం, నైపుణ్యమున్న లగడపాటి రాజగోపాల్‌ వ్యాఖ్యలు విస్మయం కలిగించడం లేదు.

వాస్తవం ఇదీ

తెలంగాణలో ఎన్నికలు అనగానే మోపయ్యే చంద్రబాబు అండ్‌ కో.. 2014లోనే కాదు! 2018 అసెంబ్లీ ఎన్నికల్లో చేయని కుట్రలు లేవు. పన్నని కుతంత్రాలు లేవు. ప్రభుత్వ వ్యతిరేకత అంటూ హోరెత్తించినా.. తెలంగాణ ఓటరు మాత్రం చెక్కు చెదరలేదు. చివరకు లగడపాటిలాంటి తెలంగాణ వ్యతిరేకుల్ని రంగంలోకి దింపినా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ప్రజలకు ఏమాత్రం నమ్మకం సడలలేదు. చంద్రబాబు సహా ఆయన చెంచెలందరి గూబ గుయ్‌మనేలా తెలంగాణ ఓటరు రికార్డుస్థాయి స్థానాలను గులాబీ పార్టీకి కట్టబెట్టాడు.

2014 నవంబరు 16 కొత్త పలుకు

ఈ మధ్య ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒక ప్రకటన వచ్చింది. దాని సారాంశం ఏమిటంటే హైదరాబాద్‌లో పలు ఎక్స్‌ప్రెస్‌ హైవేలు నిర్మించబోతున్నట్లు చెప్పారు. ఇందుకు ప్రేరణ ఏమిటంటే ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన ఒక సమావేశానికి ఒక అధికారి ఆలస్యంగా వచ్చారు. దీంతో ఆలస్యం ఎందుకైందని ముఖ్యమంత్రి ప్రశ్నించగా, వరంగల్‌ నుంచి వస్తూ ఉంటే ఉప్పల్‌ నుంచి ట్రాఫిక్‌ జాం అయ్యిందని సదరు అధికారి తెలిపారు. అంతే ఎక్స్‌ప్రెస్‌ హైవేలు, ఫ్లైఓవర్ల ప్రకటన వెలువడింది. తన ఆలోచనల సాధ్యాసాధ్యాల గురించి కేసీఆర్‌ ఆలోచించరు. ఆలోచన వచ్చిందే తడవుగా ప్రకటన చేసేస్తారు.

వాస్తవం ఇదీ నగరంలో వ్యూహాత్మక రోడ్ల

అభివృద్ధి ప్రణాళిక (ఎస్‌ఆర్డీపీ)లో భాగంగా రూ.23 వేల కోట్లతో నగరవ్యాప్తంగా ట్రాఫిక్‌ కష్టాలు తీర్చేందుకు రహదారులు, ఫ్లైఓవర్లు, ఎక్స్‌ప్రెస్‌హైవేలు, స్కైవేల నిర్మాణం శరవేగంగా సాగుతున్నది. మొదటి దశలో రూ.5 వేల కోట్ల పనులు చేపట్టగా కొన్ని అందుబాటులోకి వచ్చాయి. మరికొన్ని చివరి దశలో ఉన్నాయి. ఇంకొన్నింటి పనులు పురోగతిలో ఉన్నాయి.

17-09-2014 కొత్త పలుకు

మెట్రో రైలు ఆగిపోయేలా చేయడం ద్వారా హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ని దెబ్బ తీయడానికి కుట్ర చేస్తున్నారంటూ కేసీఆర్‌ అండ్‌ కో వాదించడంలో ఔచిత్యమెంత? హైదరాబాద్‌ మెట్రో రైలు నిర్మాణ బాధ్యతలు చేపట్టిన ఎల్‌ అండ్‌ టీ సంస్థ అధికారి గాడ్గిల్‌ రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖను ప్రచురించడాన్ని కూడా ఒక కుట్రగా తెలంగాణ ప్రభుత్వం చూడటమే ఆశ్చర్యంగా ఉంది.

వాస్తవం ఇదీ

వాస్తవంగా మెట్రో రైలు వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును చేపట్టిన నిర్మాణ సంస్థ, సంబంధిత ప్రభుత్వానికి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరగడం అనేది సహజం. పత్రికలకు ఒకవేళ ఆ లేఖ దొరికితే అందుకు అనుగుణంగా వార్తలు ప్రచురిస్తే జర్నలిజమే. కానీ గాడ్గిల్‌ లేఖను చిలువలు పలువలు చేసి.. ఇక హైదరాబాద్‌ మెట్రో రైలు ఆగిపోయినట్లే! హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజీ పడిపోయిందనేందుకు ఇదో ఉదాహరణ అన్నట్లుగా ఆంధ్రజ్యోతి బట్టలు చించుకోవడంపైనే తెలంగాణ సమాజం స్పందించింది. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిన మూడోరోజే ఇదే ఆంధ్రజ్యోతి.. మెట్రో లెక్కలు తప్పనున్నాయా? అంటూ రాష్ట్ర విభజనతో హైదరాబాద్‌ ఖాళీ అయి మెట్రోకు ప్రయాణికులే కరువవుతారని నిర్మాణ సంస్థ, హెచ్‌ఎంఆర్‌ అయోమయంలో ఉన్నదంటూ కథనం ప్రచురించడం ఏ రకమైన జర్నలిజం? మొండి పిల్లర్లతో ఆగిపోతుందని ఆర్కే ఆశించిన మెట్రోలో ఇప్పుడు రోజుకు నాలుగున్నర లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ఇప్పుడున్న 69 కిలోమీటర్లకు తోడు రెండో దశలో 64 కిలోమీటర్ల మెట్రోకు కూడా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.

06.07.2014 కొత్త పలుకు

రుణ మాఫీపై పిల్లిమొగ్గలు. తెలంగాణలో మిగులు బడ్జెట్‌ ఉందన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ పలు పథకాలను, నిర్ణయాలను ప్రకటిస్తున్నారు. అవన్నీ అమలు కావాలంటే ఎన్ని వేల కోట్లు కావాలో ఎవరికీ అంచనా లేదు. కేసీఆర్‌ అలవోకగా మాటలు చెప్పగల సమర్థుడు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా అంతే అలవోకగా పథకాలు ప్రకటిస్తున్నారు.

వాస్తవం ఇదీ

తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిందనేది తెలంగాణలోని ప్రతి ఓటరుకు తెలిసిన సత్యం. అందుకే రెండోసారీ ఘనమైన మెజార్టీతో గెలిపించాడు. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో, పాలనా పగ్గాలు చేపట్టిన రెండు నెలల వ్యవధిలోనే రుణమాఫీపై పిల్లి మొగ్గలు అంటూ ఆర్కే మార్కు విషం చిమ్మాడు. కానీ తెలంగాణ ప్రభుత్వం మొదటి టర్మ్‌లో రూ.16,124.37 కోట్ల మేర రుణాల్ని మాఫీ చేసి 35,29,944 మంది రైతుల్ని రుణ విముక్తిల్ని చేసింది. రెండో టర్మ్‌లోనూ ఇచ్చిన మాట మేరకు 40 లక్షల మందికి ఊరట కలిగించేలా రూ.30వేల కోట్ల వరకు రుణాన్ని మాఫీకి సిద్ధమైంది. ఇప్పటికే రూ.25వేల వరకు ఉన్న రైతుల రుణాన్ని మాఫీ కూడా చేశారు. కానీ ఆర్కే దోస్తు చంద్రబాబునాయుడు ఏపీలో 2014 ఎన్నికల్లో ఇచ్చిన రుణ మాఫీ హామీని ఎగ్గొట్టి తిరిగి ప్రజల చేతుల్లో చిత్తు చిత్తు అయ్యాడనేది వాస్తవం.

2014 మే, 11 కొత్త పలుకు

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. కేసీఆర్‌ వంద సంవత్సరాలపాటు ముఖ్యమంత్రిగా ఉన్నా ఈ హామీ అమలు కాదు. అమలు కావడానికి అక్కడ నీళ్లు ఉంటే కదా? రేపు ఎవరైనా ఈ హామీ గురించి ప్రశ్నిస్తే ‘నేను ఇద్దామనే అనుకున్నాను. కానీ మన నీళ్లన్నీ ఆంధ్రోళ్లు దోచుకెళ్లారు’ అని మొహమాటం లేకుండా చెప్పగల సమర్ధుడాయన!

వాస్తవం ఇదీ

కేసీఆర్‌ వంద సంవత్సరాలున్నా నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీరు సాధ్యం కాదన్నారు. కానీ ఈ ఆరేండ్లలోనే తెలంగాణ రైతాంగం రికార్డుస్థాయి సాగును నమోదుచేసింది. గత ఏడాది రెండు సీజన్లలో కోటి 23 లక్షల ఎకరాల్లో సాగుచేసిన రైతులు.. ఈ ఏడాది ఒక్క వానకాలం సీజన్‌లోనే కోటి 25 లక్షల ఎకరాల్లో సాగు చేస్తుండటం కండ్ల ముందు కనిపిస్తున్న సత్యం. నిజమే.. ఆంధ్రోళ్లు నీళ్లను దోచుకుపోయేలా సమైక్య రాష్ట్రంలో ప్రాజెక్టులు కట్టుకున్నా, ఆర్కేలాంటి వాళ్లు తెలంగాణ గడ్డ మీద ఉంటూ నిత్యం కుట్రలు చేస్తున్నా.. అన్నింటినీ అధిగమించి తెలంగాణ ప్రభుత్వం కోటి ఎకరాల మాగాణం స్వప్నాన్ని సాకారం చేసింది.