కేబినెట్ నిర్ణయాలు
1. తెలంగాణ రాష్ట్రంలో నెలకొల్పే పరిశ్రమల్లో స్థానికులకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించే నూతన విధానానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం టిఎస్ ఐపాస్ చట్టం ద్వారా కొత్త పారిశ్రామిక అనుమతుల విధానం తెచ్చింది. దీని వల్ల పెద్ద ఎత్తున పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్నాయి. అయితే ఇలా వస్తున్న పరిశ్రమల్లో తెలంగాణ యువకులకు ఎక్కువ అవకాశాలు దక్కేలా విధానం రూపొందించాలని ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశ్రమల శాఖను ఆదేశించారు.
దీనిపై మంత్రి కెటి రామారావు ఆధ్వర్యంలో కసరత్తు చేసిన పరిశ్రమల శాఖ ముసాయిదా తయారు చేసింది. దీనిపై ముఖ్యమంత్రి అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్ సమావేశం విస్తృతంగా చర్చించింది. తెలంగాణలో నెలకొల్పే పరిశ్రమల్లో స్థానికులకు ఎక్కువ అవకాశాలు రావాలని కేబినెట్ అభిప్రాయపడింది. స్థానికులకు ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చే పరిశ్రమలకు అదనపు ప్రోత్సాహకాలు అందించాలని కేబినెట్ నిర్ణయించింది.
2. హైదరాబాద్ నగరంలో ఐటి పరిశ్రమలు ఒకే చోట కాకుండా నగరం నలువైపులా విస్తరించాలని కేబినెట్ అభిప్రాయపడింది. హైదరాబాద్ పశ్చిమ ప్రాంతంలో తప్ప మిగతా చోట్ల ఐటి కంపెనీలు పెట్టే వారికి అదనపు ప్రోత్సహకాలు అందించే హైదరాబాద్ గ్రిడ్ (growth in dispersion – GRID) పాలసిని కేబినెట్ ఆమోదించింది.
3. పెరిగి పోతున్న వాహనాల వల్ల ఎక్కువయ్యే వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి తెలంగాణ రాష్ర్ట్రంలో ఎలక్ట్రానిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రత్యేక రాయితీలు ఇచ్చి రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పరిశ్రమను ప్రోత్సహించాలని నిర్ణయించింది. తెలంగాణ స్టేట్ ఎలక్ట్రానిక్ వెహికిల్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్ పాలసీని కేబినెట్ ఆమోదించింది.
4. సెక్రటేరియట్ కొత్త భవన సముదాయం నిర్మాణానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. డిజైన్లను ఆమోదించింది.