మరి కొద్ది గంటల్లో జరగనున్న రామమందిర నిర్మాణ భూమి పూజకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ చారిత్రాత్మక ఘట్టం కోసం అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. ప్రధాని నరేంద్ర మోదీ మఖ్య అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు.
ఈ నేపథ్యంలో రామాలయ నిర్మాణానికి సంబంధించిన నమూనా చిత్రాలను శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ట్విటర్ ద్వారా విడుదల చేసింది. మూడు అంతస్తుల రాతి కట్టడంలో గోపురాలు, స్తంభాలతో 161 అడుగుల ఎత్తులో నిర్మించనున్నారు.
ముందుగా అనుకున్న నమూనా కంటే ఆలయం ఎత్తు 20 అడుగులు పెంచినట్లు శిల్పులు తెలిపారు. ఆలయ సముదాయంలో ఒకే సారి లక్ష మంది భక్తులు సమావేశం కావచ్చని అంచనా. రెండెకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ ఆలయం ఉత్తర భారత దేశంలోని నాగర శైలిలో ఉండనుంది.
నమూనా ఆకృతుల ప్రకారం మొత్తం ఐదు గుమ్మటాలు ఉంటాయి. అలానే గర్భగుడి అష్టభుజి ఆకృతిలో ఉంటుంది. ఆలయం నిర్మాణం పూర్తి కావడానికి దాదాపు మూడేళ్ల సమయం పడుతుందని శిల్పులు తెలిపారు.