Home / SLIDER / తడబడి నిలబడ్డ తెవాతియ.. నిజంగా అద్భుతం

తడబడి నిలబడ్డ తెవాతియ.. నిజంగా అద్భుతం

‘‘నన్ను నేను నమ్మాలని నిర్ణయించుకున్నాను. ఒక్క సిక్స్‌ కొట్టాలనుకున్నాను. తర్వాత అదే కొనసాగించాలని ఫిక్స్‌ అయ్యాను. అయితే ఒకే ఓవర్‌లో ఐదు సిక్స్‌లు కొట్టడం నిజంగానే అద్భుతం. నిజానికి లెగ్‌ స్పిన్నర్‌ బౌలింగ్‌లో సిక్సర్లు బాదేందుకు కోచ్‌ నన్ను పంపించారు.

దురదృష్టవశాత్తు ఆ పనిచేయలేకపోయాను. అయితే అంతిమంగా ఇతర బౌలర్లపై విజయం సాధించాను’’ అంటూ రాజస్తాన్‌ రాయల్స్‌కు అద్భుతమైన విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించిన రాహుల్‌ తెవాతియా హర్షం వ్యక్తం చేశాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఎదుర్కొన్న తొలి 20 బంతులు తన కెరీర్‌లో అత్యంత చెత్త బంతులు అని క్రీజులో నిలదొక్కుకునేందుకు శ్రమించిన తీరును ప్రస్తావించాడు.

మరోవైపు ఐపీఎల్‌-2020 సీజన్‌లో భాగంగా కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. స్టీవ్‌ స్మిత్‌(50; 27 బంతుల్లో 7ఫోర్లు, 2 సిక్స్‌లు), సంజూ శాంసన్‌(85; 42 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లు), తెవాతియా( 53; 31 బంతుల్లో 7 సిక్స్‌లు)లు విక్టరీలో కీలక పాత్ర పోషించారు.

అయితే చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చివేసిన తెవాతియా గేమ్ ఛేంజర్‌గా నిలిచాడు. అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఈ లెఫ్ట్‌ హ్యాండర్‌, 18వ ఓవర్‌లో ఐదు సిక్స్‌లు కొట్టి కాట్రెల్‌కు చుక్కలు చూపాడు.