తెలంగాణ శాసనసభ కీలకమైన నాలుగు బిల్లులకు ఆమోదం తెలిపింది. జీహెచ్‌ఎంసీ సహా నాలుగు చట్టాల సవరణ కోసం బిల్లులను సభలో ఆయా శాఖల మంత్రులు ప్రవేశపెట్టారు. అనంతరం బిల్లులపై చర్చించి.. సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇచ్చారు. అనంతరం ఈ నాలుగు బిల్లులను ఆమోదిస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. కేవలం చట్టసవరణ కోసం ఉద్దేశించిన సమావేశాలు కావడంతో ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు.
ఇండియన్ స్టాంప్ బిల్లు(తెలంగాణ)2020, తెలంగాణ అగ్రికల్చర్ ల్యాండ్ సవరణ బిల్లు(కన్వర్షన్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్)- 2020ను శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, జీహెచ్ఎంసీ సవరణ బిల్లు-2020ను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సవరణ బిల్లు – 2020ను న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రవేశపెట్టారు.
సభలో ఆమోదం పొందిన బిల్లులు:
1. ఇండియన్ స్టాంప్ బిల్లు (తెలంగాణ) 2020
-భూముల ప్రాథమిక విలువ నిర్ధరణకు సంబంధించి సబ్ రిజిస్ట్రార్లకు 47ఏ కింద విచక్షణాధికారాలను తొలగిస్తూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల చట్టానికి సవరణ చేశారు.
2. తెలంగాణ అగ్రికల్చర్ ల్యాండ్ సవరణ బిల్లు(కన్వర్షన్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్)- 2020
-వ్యవసాయ భూములను వ్యవసాయేతరంగా బదలాయించేందుకు అధికారులకు విచక్షణాధికారాలు రద్దు చేశారు. -ధరణి ద్వారానే ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకునేలా నాలా చట్టాన్ని సవరించారు.-వ్యవసాయేతర ఆస్తులకు కూడా గుర్తింపు సంఖ్య ఇచ్చేలా చట్టానికి సవరణలు చేశారు.
*3. జీహెచ్ఎంసీ సవరణ బిల్లు – 2020 *
-మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ సవరణ చేశారు. -10 శాతం గ్రీన్ బడ్జెట్‌కు నిధుల కేటాయింపు.
-10 సంవత్సరాలకు ఒకసారి రిజర్వేషన్ల మార్పునకు సవరణ.
-నాలుగు రకాల వార్డు వాలంటీర్ల కమిటీల ఏర్పాటుకు సవరణ.
-ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వాన్ని ఎస్ఈసీని సంప్రదించాలని చట్ట సవరణ.
*4. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సవరణ బిల్లు – 2020 *
హైకోర్టు సూచన మేరకు నిందితులకు పూచీకత్తు అంశానికి సంబంధించిన సీఆర్పీసీ చట్టాన్ని సవరించారు.