‘‘దేశంలో ఎవరింట్లో డబ్బులు దొరికినా తనవేనని బద్నాం చేస్తున్నారని దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు అంటున్నారు. ఎవరింట్లోనో డబ్బులు దొరికితే నీకు భయమెందుకు? అక్కడికి వెళ్లి నువ్వెందుకు అతి చేశావు? దుబ్బాకలో ప్రచారం పక్కనబెట్టి సిద్దిపేట వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? పోలీసుల చేతుల్లోంచి డబ్బులు ఎందుకు లాక్కున్నారు?’’ అని మంత్రి హరీశ్‌రావు..
రఘునందన్ రావును ప్రశ్నించారు. డిపాజిట్ ఓట్లు కూడా దక్కవనే ఆలోచనతో రాజకీయ సానుభూతి కోసం బీజేపీ అభ్యర్థి ఇలాంటి కొత్త నాటకాలకు తెరదీస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే పలుమార్లు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడినా వారి తీరు మారడం లేదని విమర్శించారు.
సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని తొగుట మండల కేంద్రంలో టీఆర్‌ఎస్ అభ్యర్థికి మద్దతుగా యువకులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. డబ్బులు, సీసాలు పంచితే ఓట్లు పడతాయనే భ్రమలో బీజేపీ ఉన్నదన్నారు.
ఏనాడూ సిద్దిపేట, దుబ్బాక ముఖం ఎరుగని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.. ఇప్పుడు సిద్దిపేటకు వచ్చి విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమానికి కిషన్‌రెడ్డి వ్యతిరేకమని, డిసెంబరు 9 ప్రకటన వెనక్కు తీసుకోవడంతో తామంతా రాజీనామా చేస్తే ఆయన మాత్రం పదవిని పట్టుకొని ఉన్నారన్నారు. ఢిల్లీలోనే కాదు.. గల్లీలోనూ కాంగ్రెస్ లేదని ఎద్దేవా చేశారు.