Home / EDITORIAL / రాజకీయ వారసత్వం కాదు.. తెలంగాణ రాజకీయాలకు జవసత్వం ..!!

రాజకీయ వారసత్వం కాదు.. తెలంగాణ రాజకీయాలకు జవసత్వం ..!!

తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం ఎంత ముఖ్యమో.. రాష్ట్రంలో స్వయం పాలన ను నిలబెట్టడానికి, అభివృద్ధి పథాన నడిపించడానికి , పటిష్టమైన నాయకత్వం అంతే ముఖ్యం. ఈ నేపథ్యంలోంచే వర్తమాన తెలంగాణలో భవిష్యత్తు నాయకత్వం రూపుదిద్దుకుంటున్నది. ఆ క్రమంలోనే, యువమంత్రి కేటీఆర్ ను సిఎం కెసిఆర్ కొడుకుగానే కాకుండా, రేపటి తరానికి నాయకుడిగా రూపుదిద్దుకుంటున్న పరిణామ క్రమాన్ని మనం అర్థం చేసుకోవాల్సి వున్నది. కేటీఆర్ నేడు ఈ స్థాయికి చేరుకోవడమనేది యేదో ఆశామాషిగా జరిగిన పనికాదు. వెనక కఠోర శ్రమ వున్నది. ఎన్నో కఠిన పరీక్షలు అగ్ని పరీక్షలు ఎదుర్కోవాల్సి వచ్చింది. వెలుగులు విరజిమ్మాలంటే వజ్రం అనేక కఠిన పరీక్షలకు గురికావాల్సి వస్తుంది. అట్లా కేటీఆర్ కూడా తన సామర్థ్యాన్ని ప్రతి పరీక్షలో నిరూపించుకుంటే వస్తున్నడు. అట్లా తెలంగాణను సాధించి స్వయం పాలననున నిలబెట్టిన Father of Telangana కేసీఆర్, రేపటి తెలంగాణ కోసం Future Telangana Leadershipను తీర్చిదిద్దే మహా కార్యంలో కూడా కృతకృత్యులైండ్లనేది నేటి వాస్తవం.

ఈ నేపథ్యం లోంచి గమనించినట్టయితే,.కెటిఆర్ ముఖ్యమంత్రి కావడాన్ని వారసత్వ రాజకీయాలుగా కాకుండా జవ సత్వ రాజకీయాలుగా అర్థం చేసుకోవాలి. ఇతర రాజకీయ నాయకుల్లాగా తనయుడు కేటీఆర్ పై పుత్ర వాత్సల్యాన్ని రాజకీయాల్లో ఏనాడూ ప్రదర్శించలేదు. అసమర్దుడైనా సరే, తన కొడుకు కాబట్టి అధికారాన్ని కట్టబెట్టాలని చూడటంలేదు. అందువల్ల, కొడుకైనందుకే కేటీఆర్ కు రాజకీయ అవకాశం వచ్చిందనేది కూడా సరికాదు. కేటీఆర్ ను సీఎంగా చేయాలని కేసీఆర్ భావిస్తున్నాడంటే, యువ నాయకత్వానికి అధికారాన్ని బదిలీ చేస్తున్నాడనే కోణంలో అర్ధం చేసుకోవాలే తప్ప, కొడుకుకు పట్టం కడుతున్నాడనే సాంప్రదాయ భావనతో కాదు. ఉద్యమకాలం నుంచి నేటిదాకా కేటీఆర్ లాగా ఏ యువనేతా ఇన్నిరకాల అగ్నిపరీక్షలు ఎదుర్కొని నిలవలేదు. ఇది తెలంగాణ భవిష్యత్ నాయకత్వానికి కేసీఆర్ ఇచ్చిన కఠినమైన రాజకీయ శిక్షణగానే భావించాలె. లేకుంటే.. ఉద్యమాన్ని, స్వయంపాలనను సరిగా అర్ధం చేసుకోలేకపోవడమే అవుతుంది. తెలంగాణ వచ్చినప్పటినుంచీ కొన్ని ప్రతీపశక్తులు స్వయంపాలనను ఆగంచేయాలని చూసినయి.. ఇంకా చూస్తున్నయి కూడా. నేడు ప్రజాస్వామ్య రాజకీయ సుస్థిరత, అభివృద్ధి అత్యంత కీలకంగా మారినయి.

ఒక్కసారి కేటీఆర్ రాజకీయ ప్రస్థానాన్ని పరిశీలించినట్లయితే.. తన ఎదుగుదల వెనక Golden tea spoon కహానీ ఏం లేదు.. ఉద్యమంలో, ప్రజల్లో తన సమర్ధతను చాటుకున్నంకనే, కేటీఆర్ శక్తి సామర్థ్యాలను పూర్తిగా పరిశీలించాకే ఎమ్మెల్యే టికెట్ దక్కింది తనకు. మంత్రి పదవి కట్టబెట్టినా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అవకాశం వచ్చినా, అనేక అగ్ని పరీక్షలను ఎదుర్కొన్న తర్వాత మాత్రమే. కేటీఆర్ సామర్థ్యాన్ని పెంచుకున్నాడని తెలుసుకున్నాకే.. ప్రమోషన్ వచ్చింది ప్రతిసారి. అట్లా కేటీఆర్ కు- కేసీఆర్ తండ్రి కావచ్చు కానీ, అంతకు మించి రాజకీయ గురువు కావడం వల్లనే కేటీఆర్ రాజకీయ పరీక్షల్లో నెగ్గుకుంటూ ఇవాళ పరిపూర్ణత సాధించిండని చెప్పవచ్చు.

తెలంగాణ ఉద్యమం కేసీఆర్ కంటే ముందు 40 ఏండ్లు సాగింది. అయినా గమ్యాన్ని చేరుకోలేక పోవడానికి కారణం, బలమైన నాయకత్వం లేకపోవడమే. అదే కెసిఆర్ ఉద్యమ ప్రవేశంతో, పటిష్టమైన నాయకత్వం ఉద్యమం సొంతమైంది. సుదీర్ఘ శాంతియుత పోరాట పంథాను అమలు పరిచి ఎన్నో త్యాగాలకు, కష్ట నష్టాలకు ఓర్చుకొని సబ్బండ వర్ణాలను ఏకం చేసి, ఉద్యమ స్ఫూర్తిని రగిలించి, తెలంగాణను సాధించింది కేసీఆర్ బలమైన నాయకత్వమేననడంలో అతిశయోక్తి లేదు. అట్లా బలమైన కేసీఆర్ నాయకత్వంతోనే తెలంగాణ వచ్చి, తెలంగాణ వ్యతిరేకుల ఎత్తుల్ని చిత్తు చేసి, రాజకీయ సుస్థిరత్వాన్ని, స్వయంపాలనను, తెలంగాణలో నిలబెట్టి, కెసిఆర్ ను తెలంగాణ జాతిపితగా నిలిపింది..తను అనుసరించిన పటిష్టమైన నాయకత్వ పంథానే.

సబ్బండ వర్ణాలకు సమన్యాయం న్యాయం చేసి చూపించినా, ప్రపంచమంతా తెలంగాణ వైపు చూసేలా చేసినా తెలంగాణ వ్యతిరేకుల కుట్రలను ఎప్పటికప్పుడు తుత్తునియలు చేసినా, తెలంగాణ నేడు అన్నిరంగాల్లో అభివృద్ధి పథాన నడుస్తున్నా..అది బలమైన నాయకత్వం వల్లనే అని మనం అర్ధం చేసుకోవాల్సి వున్నది.
అట్లా ముందుకు సాగుతున్న తెలంగాణలో విచ్ఛిన్నకర శక్తులను ఎదుర్కోవాలంటే బలమైన నాయకత్వ అనుభవానికి, చురకత్తుల వంటి యువ నాయకత్వం కూడా తోడు కావాల్సిన అవసరం ఉన్నది. నిన్నటి తరాల భుజాల మీద నుంచి రేపటి భవిష్యత్తును చూడగలిగినప్పుడే పరిపాలనలో తెలంగాణ రాష్ట్రం సరికొత్త చరిత్రను సృష్టించ గలదు.

సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటూ, ఉద్యమాన్ని నడిపించి, తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సీఎం కేసీఆర్ కు నాయకత్వ బదిలీకి సంబంధించి ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో బాగా తెలుసుననే సంగతి ప్రపంచానికి తెలుసు. నిర్దిష్ట పరిస్థితులకు నిర్దిష్ట కార్యాచరణ అనే గతితార్కిక రాజకీయ పంథాను అనుసరించడంలో సీఎం కేసీఆర్ కు ఈ దేశ రాజకీయాల్లోనే ఎవరూ సాటిరారు. కాబట్టి యువనేత కేటీఆర్ ను ముఖ్యమంత్రిని ఎప్పుడు చేయాలనే అంశం పట్ల సీఎం కేసీఆర్ కు నిర్దిష్ట అవగాహన వున్నదనే సంగతిని రాజకీయ విమర్శకులు, అభిమానులు అర్ధం చేసుకోవాల్సి ఉన్నది. అప్పటిదాకా ప్రతిపక్ష నేతలు అనవసరమైన విమర్శలు మానుకుంటే మంచిది. కెటిఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్న అధికార పక్ష నేతలు, ఇందుకు సంబంధించిన మరింత అవగాహన పెంచుకుంటే మంచిది.
– సహస్ర

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat