తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై బీజేపీ శ్రేణులు చేసిన దాడులను టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు ఏ మాత్రం చోటు లేదన్నారు.
బీజేపీ తీరును ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలని ఆదివారం ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గతంలోనూ బీజేపీ భౌతిక దాడులకు ప్రయత్నించిందని విమర్శించారు. టీఆర్‌ఎస్ శ్రేణులను, ప్రతి కార్యకర్తను కాపాడుకునే శక్తి, బలం తమకు ఉన్నాయన్న విషయాన్ని బీజేపీ గుర్తుంచుకోవాలని చెప్పారు.
టీఆర్‌ఎస్ కార్యకర్తల ఓపిక నశిస్తే బీజేపీ నాయకులు బయట తిరగలేని పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు. తమ ఓపికకూ ఒక హద్దు ఉంటుందన్నారు. తెలంగాణలో చిచ్చు పెట్టేలా బీజేపీ చేస్తున్న కుటిల ప్రయత్నాలను ప్రజలు గమనించి ఎక్కడికక్కడ నిలదీయాలని కోరారు.