తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసినన్ని పనులు ఇండియాలో మరే రాష్ట్రంలోనైనా చేశారా? మంచిగున్నదాన్ని.. మంచి ప్రభుత్వాన్ని.. మంచి చేసేటోళ్లను నిలబెట్టుకోవాలె. చెడగొట్టుకుంటే మనం ఆగమైపోతం. నేను చెప్పే మాటలో ఒక్క అబద్ధం ఉన్నా రేపు నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ను ఓడగొట్టండి. నేను చెప్పేది నిజమైతే వేరే పార్టీలకు డిపాజిట్లు దక్కకుండా టీఆర్‌ఎస్ జెండా ఎగురేయండి. టీఆర్‌ఎస్‌కే ఓటు అడిగే హక్కు ఉన్నది. మంచి చేసినవాళ్లను గెలిపిస్తే మరింత మంచి జరుగుతది.
ఈ దేశంలో కల్యాణలక్ష్మి ఎవరైనా ఇచ్చిన్రా? కనీసం ఎవరైనా ఇస్తారని అనుకున్నమా? పేదింటి ఆడబిడ్డల పెండ్లి తల్లిదండ్రులకు సమస్య కావొద్దని ఆలోచించి లక్ష రూపాయిలు ఇస్తున్నం. ఇదొక యూనిక్ పథకం.
యావన్మంది రాష్ట్ర ప్రజలను కంటి చూపు సమస్యల నుంచి దూరం చేయాలని కంటివెలుగు ద్వారా పరీక్షలు చేయించినం. 50-60 లక్షల మంది పేదలకు కండ్లద్దాలు ఇచ్చినం.
మా ప్రభుత్వంలో కేసీఆర్ కిట్ కింద ఆడబిడ్డ పుడితే రూ.13వేలు, మగపిల్లవాడు పుడితే రూ.12వేలు ఇస్తున్నం. గర్భం ధరించిన పేదింటి ఆడబిడ్డలు కూలీకి పోకుండా, వారి ఆత్మగౌరవం దెబ్బతినకుండా కేసీఆర్ కిట్ రూపంలో ఆదుకుంటున్నం.
ధరణితో లంచాల బాధ పోయింది. పది నిమిషాల్లో రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ కూడా అయిపోయి రైతు గల్లా ఎగురేసుకొని పోతాఉన్నడు. అవసరమైతే కొత్త చట్టం తెచ్చి, ఎవరూ ఒక్క రూపాయి ఎవరికీ ఇచ్చే అవసరం లేకుండా.. భూ సమస్యలు రైతులకు లేకుండా చేసే బాధ్యత నాది.
30 లక్షల మంది గొల్లకురుమలున్న రాష్ట్రంలో గొర్రెలు దిగుమతి అయితే మనకు సిగ్గుచేటు. అందుకే రెండేండ్ల నాడు గొర్రెల పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టినం. 7.5లక్షల దరఖాస్తులు వచ్చినయ్. ఇప్పటికి 3 లక్షల 70వేల మందికి ఇచ్చినం. ప్రతీ యాదవకుటుంబానికి గొర్రెల యూనిట్ ఇప్పించే బాధ్యత కేసీఆర్‌దే
మత్స్యకారులను ఎవరైనా పట్టించుకున్నరా? 160 కోట్ల బడ్జెట్‌తో ఉచిత చేపపిల్లలు ఇస్తున్నాం. మత్స్యకారులను ఆదుకుంటున్నం.
అమెరికా వచ్చి అబ్బురపడేవిధంగా గ్రామాలు తయారు కావాలె. సర్పంచ్‌లు అందరూ బాగా చేస్తున్నరు ఇంకా బాగా చేయాలె. జిల్లా పరిషత్‌లకు, మండల పరిషత్‌లకు బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు ఇవ్వబోతున్నం.
మీరిచ్చే దీవెనలే మాకు కొండంత బలం. నెల్లికల్లు లిఫ్ట్ ద్వారా 25 వేల నుంచి 30 వేల ఎకరాలకు నీళ్లిస్తాం. పెద్దదేవులపల్లికి గోదావరి నీళ్లు తెచ్చి నాగార్జునసాగర్ ఆయకట్టు కింద ఒక్క ఎకరా కూడా బీడు లేకుండా కుర్చీ ఏసుకొని కూసొని పనులు చేయించే బాధ్యత నాది.
రాజకీయ గుంటనక్కలు ఎప్పుడూ ఉంటయ్. వాటిని చూసి మోసపోతే ఆగమైతం. వాళ్లను చూసి మోసపోకుండా ఒకరికొకరం భుజం కలిపి ముందుకుపోదాం. నాకు అండగా ఉండండి. మిమ్మల్ని అన్ని రకాలుగా ఆదుకునే బాధ్యత నాది.
ఊర్లు ఇయ్యాల పచ్చగా ఉన్నయ్. అన్నానికి ఎవరూ బాధపడుతలేరు. దాన్ని చూసి కాంగ్రెస్‌కు కండ్లు మండుతున్నయ్. ఓర్వలేక అవాకులు చవాకులు పేలుతున్నరు. వాళ్లకు మీరే సమాధానం చెప్పాలె. ప్రజాస్వామ్యంలో ధర్మాన్ని గెలిపించాలె అని నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు…