మనం మానవులం.. ఎన్నో కర్మలు చేస్తాం. ఇలాంటి మనం శివుడు ఎలా అవుతాం? శివోహం అని ఎందుకు అంటున్నాం? మనం శివుడిగా మారాలి అంటే మనం తెలుసు కోవలసినది ఏమిటి? మన గ్రూప్ లో ఉన్న సభ్యులు అందరికి తప్పక తెలియాల్సిన విషయం ఇది.
ఆది శంకరాచార్యుల వారి సాహిత్యమును స్తోత్ర (భక్తి) సాహిత్యము, వైరాగ్య ప్రకరణములు అని రెండుగా విభజించవచ్చు… ఆది శంకరాచార్య విరచిత నిర్వాణషట్కం వైరాగ్య ప్రకరణముల కోవలోనిది. నిర్వాణషట్కం భారతీయ వేదాంత మార్గంలో ఉన్నతమైన రచన. నిజానికి ఎంతో దీర్ఘమైన వ్యాఖ్యానము, వివరణ అవసరము. కాని, ఇక్కడ క్లుప్తముగా మాత్రమే చర్చ ప్రస్తుతానికి! ఆధునిక పోటీ పరీక్షలలో సమాధానం సరిగా తెలియనప్పుడు, సరైనవి కాని సమాధానములను వరుసగా ఇది కాదు, ఇది కాదు అని.. చివరికి సరి ఐన లేదా సరి ఐనట్లు అనిపించిన సమాధానము ను చేరుకొనే పద్ధతి ఒకటి ఉంది. భగవంతుని రూపమును, తత్త్వమును తెలిసికొనడం అసాధ్యం కనుక, ఏది భగవంతుడో తెలియనప్పుడు, ఏది భగవంతుని తత్త్వమో తెలియనప్పుడు ఏది భగవంతుని తత్త్వము కాదో తెలిసికొనడం తేలిక కనుక ‘ఇది కాదు’ ‘ఇది కాదు’అని తీసి వేస్తూ చివరికి మిగిలిన వర్ణనకు, వ్యాఖ్యానమునకూ అందని తత్త్వమేదో అదే పరమాత్మ తత్త్వము అని తెలిసికొనడాన్ని వేదాంతం.
”నేతి… నేతి” అంటే, ‘న ఇతి’, ‘న ఇతి’, అంటే, ‘ఇది కాదు’ ‘ఇది కాదు’.. అని చెప్పింది! ‘మనో బుద్ధ్యహంకార చిత్తాని నాహం’ మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము అనే నాలుగువిధములైన అంతఃకరణ ప్రవృత్తులు వున్నాయి. మనసు అన్నింటికీ అధిపతి. లేని దాన్ని ఉన్నట్లుగా, తనది కాని దాన్ని తనదే అన్నట్లుగా, క్షణికమైన దానిని శాశ్వతమన్నట్లుగా మరులు గొల్పుతుంది, వుసి గొల్పుతుంది, పురి కొల్పుతుంది, భ్రమింప జేస్తుంది, మరిపిస్తుంది, మురిపిస్తుంది. ఆకాశానికెత్తేస్తుంది. కడకు పాతాళానికి తొక్కేస్తుంది.
మనిషికి మనస్సే అన్నింటికి మూల కారణం, ప్రేరణ, ఉత్ప్రేరకం, వినాశకరం.
నాది, నాది కాదు – అనేదే బంధానికి, మోక్షానికి కారణాలు. నాది అనేది, నాకు మాత్రమే అనే విచిత్ర బంధం. ఇతరులగురించి ఆలోచింపజేయదు. ఎవరికి చెందకూడదు అంటుంది. పూర్తి స్వార్థం. ఇది వినాశనానికి దారితీస్తుంది.
నేను అనేది సాత్వికం. నేను కూడా అనేది రాజసిక అహంకారం. నేను మాత్రమే అనేది తామశిక అహంకారం.
నేను ఏమిటి, ఎవరు, ఎందుకు, ఎక్కడ నుండి ఎక్కడికి అనే అన్వేషణ సాత్వికం. మనిషిని ఉన్నతస్థితికి చేర్చుతుంది. నేను కూడా అనేది రాజసికమైనది. నాకు ఒక ఉనికి, నాకు శక్తి ఉంది అని సాధనకు ఉపయోగిస్తుంది. ఈ రెండూ మంచివే, అవసరమే.
నేనుమాత్రమే, నాకు మాత్రమే అనే తామసిక ప్రవృత్తి కల్గిన వారికి, వారిని వారి ద్వారా నే సర్వ నాశనం చేస్తుంది.
దీనికంతా మనస్సే కారణం.
కనుకనే మనస్సును బుద్ధికి స్వాధీనం చేసి, బుద్ధి ద్వారా కల్గిన విచక్షణ తో మంచి చెడులు తెలుసుకొని, మంచిని గ్రహించి, చెడును పారద్రోలాలి. కనుక బుద్ధి పరమాత్మ తత్వం.
బుద్ధికి మనస్సును అప్పచెప్పి జీవిత ప్రయాణం చేస్తే, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు దారి తప్పవు. మంచి కర్మలు మిగులుతాయి. అప్పుడు మానవుడు శివుడవుతాడు.