Home / ANDHRAPRADESH / ఏపీ సీఎం జగన్ పై గుత్తా సుఖేందర్‌ రెడ్డి ఫైర్

ఏపీ సీఎం జగన్ పై గుత్తా సుఖేందర్‌ రెడ్డి ఫైర్

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకంతో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుందని శాసన మండలి మాజీ చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి అన్నారు. 1956 నుంచే తెలంగాణకు దక్కాల్సిన కృష్ణా జలాలను దోపిడీ చేస్తున్నారని వెల్లడించారు.

వైఎస్సార్ హయంలో పోతిరెడ్డిపాడు నుంచి 55 వేల క్యూసెక్కుల నీటిని దోపిడీ చేశారని, అప్పట్లోనే తాము వ్యతిరేకించామన్నారు. ఇప్పుడు జగన్ కూడా కృష్ణ జలాలను దోచుకుపోవాలనే దుర్భుద్ధితో వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. నల్లగొండలోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా శ్రీశైలం డ్యామ్ నుంచి 800 ఫీట్లు నుంచే నీళ్లు తీసుకుపోతాను అనడం అత్యంత దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీశైలం బెడ్ లెవల్ నుంచే నీళ్లు తీసుకుపోవాలనే ఆలోచన సరికాదన్నారు. ఇది తెలంగాణకు తీవ్ర నష్టం చేయడమేనని విమర్శించారు. ఈ ప్రాజెక్టును సీఎం కేసీఆర్ మొదటి నుంచే వ్యతిరేకిస్తున్నారని, కేంద్రానికి లేఖలు రాశారని చెప్పారు. కానీ జగన్ దొంగచాటుగా పనులు చేయడం సరికాదు. రాయలసీమ పథకంతో భవిష్యత్తులో నల్లగొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాలకు తీవ్రమైన నష్టం వాటిళ్లుతుందని చెప్పారు.