తెలంగాణలోని జూనియర్ పంచాయతీ కార్యదర్శుల వేతనాన్ని రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచింది. నెలకు రూ.28,719 వేతనాన్ని ఖరారుచేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఇన్‌చార్జి కార్యదర్శి, కమిషనర్ రఘనందన్‌రావు సోమవారం ఆదేశాలు జారీచేశారు. ఇప్పటివరకు జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు నెలకు రూ.15 వేల వేతనాన్ని చెల్లించారు.
పెరిగిన వేతనం జూలై 1 నుంచి అమల్లోకి వస్తుందని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 9,355 జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు లబ్ధి చేకూరనున్నది. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ప్రొ బేషనరీ పీరియడ్‌ను మూడేండ్ల నుంచి నాలుగు సంవత్సరాలకు పెంచుతున్నట్లుగా ఉత్తర్వుల్లో తెలిపారు.
సీఎం కేసీఆర్ నిర్ణయంపై జూనియర్ పంచాయతీ కార్యదర్శులు హర్షం వ్యక్తం చేశారు. ఒకేసారి రూ.13వేలకు పైగా వేతనం పెంచుతూ జీవో 26 జారీచేయడంపై జూనియర్ పంచాయతీ సెక్రటరీ సంఘం అధ్యక్షుడు మహేశ్, కార్యదర్శి విజయ్‌కుమార్ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.