చిత్రం: రాజ రాజ చోర
బ్యానర్స్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్
నటీనటులు: శ్రీవిష్ణు, మేఘా ఆకాశ్, సునైన, రవిబాబు, గంగవ్వ, తనికెళ్ల భరణి, అజయ్ ఘోష్, ఇంటూరి వాసు తదితరులు
రచన, దర్శకత్వం: హితేశ్ గోలి
నిర్మాతలు: టి.జి.విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్
కో ప్రొడ్యూసర్: వివేక్ కూచిబొట్ల
క్రియేటివ్ ప్రొడ్యూసర్: క్రితి చౌదరి
సంగీతం: వివేక్ సాగర్
సినిమాటోగ్రఫీ: వేద రామన్
ఎడిటింగ్: విప్లవం నైషదం
ఆర్ట్: కిరణ్ కుమార్ మన్నె
స్టైలింగ్: శ్రుతి కూరపాటి
కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం కాస్త తగ్గుతున్నట్లు అనిపించిన తర్వాత థియేటర్స్‌లో విడుదలవుతున్న సినిమాల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నాలుగు వారాల్లో వచ్చిన చిత్రాలన్నీ చిన్నవే. అందులో ఒకటో, రెండో మినహా మిగిలినవి ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ క్రమంలో వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న హీరో శ్రీవిష్ణు `రాజరాజచోర` చిత్రంతో ప్రేక్షకుడి ముందుకు వచ్చాడు. టీజర్, ట్రైలర్, కిరీటంతో ఉన్న శ్రీవిష్ణు లుక్ ఇవన్నీ సినిమాపై ప్రేక్షకులకు ఓ క్యూరియాసిటీని పెంచాయి. మరి శ్రీవిష్ణు థియేటర్స్‌కు వచ్చే ప్రేక్షకుల మనసులు చోరీ చేస్తాడా? లేదా? అనే విషయాన్ని తెలుసుకోవాలంటే మాత్రం సినిమా కథేంటో తెలుసుకుందాం.
కథ:
భాస్కర్(శ్రీవిష్ణు) ఓ జెరాక్స్ షాపులోపనిచేస్తుంటాడు. అబద్దాలు చెప్పి విద్య(సునైన)ను పెళ్లి చేసుకుంటాడు. వారికి ఓ కొడుకు పుడతాడు. తనకు అబద్దం చెప్పి పెళ్లి చేసుకున్నందుకు కేసు వేస్తానని, అలా చేయకుండా ఉండాలంటే తనను లాయర్ కోర్సు చదివించాలని భాస్కర్‌ను విద్య బెదిరించి చదువుకుంటూ ఉంటుంది. పెళ్లైన భాస్కర్ తాను సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అని చెప్పి, సంజన(మేఘా ఆకాశ్)తో ప్రేమ పాఠాలు వళ్లిస్తుంటాడు. ఆమె కూడా సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తుంటుంది. ప్రేయసి కోసం, భార్య చదువు కోసం భాస్కర్ చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటాడు. ఓ పెద్ద దొంగతనం చేసి, ప్రేయసితో వెళ్లిపోవాలని ప్లాన్ చేసుకుంటాడు భాస్కర్. మరోవైపు సీఐ విలియం రెడ్డి(రవిబాబు) కంట్రోల్‌లోని ఏరియాలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతుంటాయి. అతనిపై ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్న అతను ఎలాగైనా ఈ సమస్య నుంచి బయటపడాలని చూస్తుంటాడు. ఓ సందర్భంలో భాస్కర్ ఓ దొంగతనం చేస్తూ విలియం రెడ్డి కంటపడతాడు. అదే సమయంలో విలియం రెడ్డి ఓ తప్పు చేసి తప్పించుకునే ప్రయత్నాల్లో ఉంటాడు. ఇంతకీ విలియం రెడ్డి చేసిన తప్పేమిటి? పోలీసులకు దొంగగా దొరికిన భాస్కర్ ఎలా తప్పించుకుంటాడు? భాస్కర్ భార్య విద్యను వదిలేసి, ప్రేయసి సంజనతో వెళ్లిపోతాడా? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ:
అబద్దాలు బంధాలను నిలపవు అనే పాయింట్‌ను దర్శకుడు హసిత్ గోలి ఈ `రాజరాజచోర` సినిమాతో చెప్పే ప్రయత్నం చేశాడు. పరిమితమైన పాత్రలతోనే ఎక్కడా గందరగోళాలకు తావివ్వకుండా హసిత్ కథనాన్ని నడిపించాడు. అబద్దాలు చెప్పే హీరో, అతని భార్య, ప్రేయసి ఉంటారు. వారి మధ్య అనుబంధాలు.. భార్యను విడిచిపెట్టి హీరో వెళ్లిపోవాలని అనుకుంటున్న సమయంలో ఓ చిన్న ట్విస్ట్.. భార్యపై ప్రేమ పెరగడం, చివరకి హీరో దొంగ అనే కాదు.. అబద్దాలు చెబుతాడు అనే విషయం తెలియడం.. ఈ కథ నడిచే క్రమంలో ఓ బ్యాడ్ పోలీస్ ఆఫీసర్, దొంగను ఇబ్బంది పెట్టడం ఇలాంటి అంశాలన్నింటినీ కాస్త కామెడీ కోణంలో, ఎమోషన్స్‌ను మిక్స్ చేస్తూ తెరకెక్కించారు. ప్రథమార్థంలో హీరో, అతను చేసే దొంగతనాలు, పోలీసులకు చిక్కడం, మధ్యలో హీరో భార్య, ప్రేయసితో సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. తొలి పదిహేను నిమిషాల తర్వాత సినిమా కాస్త స్పీడందుకుంటుంది. హీరోకు అప్పటికే పెళ్లై, పిల్లాడునాడనే సంగతిని దర్శకుడు చక్కగా రివీల్ చేశాడు. ఇక సెకండాఫ్‌లో సునైన పాత్ర, రవిబాబు పాత్రలో హీరో పాత్ర చేసే ట్రావెల్ ఎక్కువగా కనిపిస్తుంది. తనను ఇబ్బంది పెట్టిన పోలీస్ ఆఫీసర్‌ను హీరో ఇరికించడం, తాను చెప్పిన అబద్దాలు వల్ల ఎవరెంత బాధపడ్డారనే నిజాన్ని హీరో చివరకు నిజం తెలుసుకోవడం, తను మారడానికి ఏం చేశాడనే పాయింట్‌తో సినిమా ముగుస్తుంది.
ఈ అంశాలన్నీ గొప్ప ట్విస్టులతో సాగలేదు కానీ.. ఎక్కడా ప్రేక్షకుడి బోర్ కొట్టదు. శ్రీవిష్ణు సమయాన్ని బట్టి మార్చే డైలాగ్ టోన్, లుక్స్ ప్రేక్షకులను నవ్విస్తాయి. అలాగే గంగవ్వ, శ్రీవిష్ణు మధ్య వచ్చే డైలాగ్స్ కూడా ప్రేక్షకులను నవ్విస్తాయి. చివరి ఇరవై నిమిషాలు సినిమా ఓ ఎమోషనల్ కోణంలోసాగుతూ ప్రేక్షకుడిని ఆకట్టుకుంది. భర్తగా, చోరుడిగా, ప్రియుడిగా శ్రీవిష్ణు తనదైన స్టైల్లో మూడు వేరియేషన్స్‌ను చూపిస్తూ క్యారెక్టర్‌ను అద్భుతంగా క్యారీ చేశాడు. ఇక మేఘా ఆకాశ్, సునైన .. ఇద్దరి పాత్రల్లో సునైన పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత కనిపించింది. గంగవ్వ పాత్రను కామెడీ కోణంలో చూపించారు. చిన్నదైనా, పెద్దదైనా నిజం నిజమే.. వంటి ఎమోషనల్ సిట్యువేషన్‌లో చెప్పే డైలాగ్స్ సందర్భానుచితం చక్కగా పండాయి. వివేక్ సాగర్ సంగీతం అందించిన పాటలు కథలో భాగంగానే వస్తాయి. అయితే మళ్లీ మళ్లీ పాడుకునేంత ఎఫెక్టివ్‌గా లేదు. నేపథ్య సంగీతం బావుంది. వేద రామన్ సినిమాటోగ్రఫీ బావుంది. నిర్మాణ విలువలు బావున్నాయి.