వర అంటే శ్రేష్ఠమైనదని అర్థం. శ్రేష్ఠమైన లక్ష్మిని ఆరాధించే విధానమే వరలక్ష్మీ వ్రతం. ప్రాంతాచారాలను బట్టి వ్రత విధానంలో చిన్నచిన్న మార్పులు ఉంటాయి. ఎలా చేసినా తల్లి అనుగ్రహిస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా మనసును, ఇంటిని శుద్ధంగా ఉంచుకోవాలి. వ్రతం రోజు ఉదయాన్నే తలస్నానం చేయాలి. కల్లాపి చల్లి ముంగిలిని ముగ్గులతో, గడపను పసుపు, కుంకుమలతో అలంకరించుకోవాలి.
మామిడి ఆకులతో తోరణాలు కట్టాలి. వ్రతసామగ్రిని ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ఒకసారి పూజలో కూర్చున్న తర్వాత మళ్లీ లేవకుండా అన్ని వస్తువులూ అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. గణపతి పూజతో వ్రతం మొదలవుతుంది. పసుపు గణపతిని చేసి తొలి పూజ నిర్వహించాలి. తర్వాత కలశ స్థాపన, పూజ చేయాలి. లక్ష్మీదేవి ప్రతిమను అందంగా అలంకరించుకొని పీటపై ప్రతిష్ఠించుకోవాలి. షోడషోపచార పూజలు చేయాలి. శ్రీవరలక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదువుతూ పూలతో శ్రీదేవిని అర్చించాలి.
అనంతరం ధూప, దీప, నైవేద్యాలు సమర్పించాలి. సర్వోపచారాలు చేసిన తర్వాత తోరాలకు పూజ చేస్తారు. అనంతరం చేతుల్లో అక్షింతలు తీసుకొని వరలక్ష్మీ వ్రతకథ (చారుమతి కథ)ను చదవాలి. కథ పూర్తయిన తర్వాత ఆ అక్షింతలను శిరసుపై వేసుకోవాలి. మిగిలిన కుటుంబసభ్యుల శిరసులపై కూడా వేయాలి. తర్వాత నీరాజనం సమర్పించాలి.
ఇంటికి పిలిచిన ముత్తయిదువులను లక్ష్మీ స్వరూపంగా భావించి వారికి వాయినాలు ఇచ్చి, ఆశీస్సులు అందుకోవడంతో వ్రతం పూర్తవుతుంది. తెల్లవారి అంటే శనివారం అమ్మవారికి ఉద్వాసన చెప్పాలి. లక్ష్మీదేవిని ప్రతిష్ఠించిన పీటను కొద్దిగా కదిలించాలి. పూజానంతరం పూలు, ఇతర నిర్మాల్యాలను చెరువులోగానీ, ఎవరూ తొక్కని ఆకుపచ్చని చెట్ల పొదల్లోగానీ విడిచిపెట్టాలి.