పశ్చిమ బెంగాల్‌లో మూడు అసెంబ్లీ స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికలకు ఆదివారం కౌంటింగ్ జరుగుతోంది. 10 గంటల వరకు అందిన ఫలితాల ప్రకారం తృణమూల్ కాంగ్రెస్ ఆధిక్యంలో దూసుకుపోతోంది. రెండవ రౌండ్ కౌంటింగ్ ముగిసిన తర్వాత 2,800 ఓట్ల ఆధిక్యంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉన్నారు. భవానీపూర్, జంగిపూర్, సంసెర్గంజ్ అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు జరుగుతోంది.
భవానీపూర్ స్థానం నుంచి సీఎం మమతా బెనర్జీ పోటీ చేశారు. సెప్టెంబర్ 30న జరిగిన ఉప ఎన్నికల్లో 57 శాతం పోలింగ్ నమోదయింది. ఆదివారం మధ్యాహ్నం కల్లా ఫలితాలపై స్సష్టత వచ్చే అవకాశం ఉంది.
భవానీపూర్ నియోజకవర్గం అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. గత అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ సొంత స్థానమైన భవానీపూర్‌ను వదిలేసి, నందిగ్రామ్ స్థానం నుంచి పోటీ చేసి.. బీజేపీ అభ్యర్థి చేతిలో ఓటమిపాలయ్యారు. ముఖ్యమంత్రిగా కొనసాగాలంటే ఆరు నెలల్లోగా ఏదో ఒక స్థానం నుంచి ఎమ్మెల్యేగా నెగ్గాల్సి ఉంది. భవానీపూర్ టీఎంసీ ఎమ్మెల్యే శోభన్‌దేవ్ ఛటోపాధ్యాయ మమతా బెనర్జీ కోసం రాజీనామా చేశారు.