సూర్య వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులని అలరిస్తున్నాడు. చివరిగా ఆకాశం నీ హద్దురా అనే సినిమాతో అలరించిన సూర్య ఇప్పుడు జై భీమ్ చిత్రంతో సందడి చేయనున్నాడు. చట్టం బలమైన ఆయుధం, అయితే ఎవరిని కాపాడటానికి మనం దానిని ఉపయోగిస్తున్నాం అనేది ప్రధానం’ ఇదే అంశంపై తెరకెక్కింది ‘జై భీమ్’ చిత్రం.
తప్పుడు కేసులో ఇరికించిన గిరిజనులవైపు పోరాడే పాత్రలో సూర్య లాయర్‌గా నటించాడు. అతనితో కోర్టులో తలపడే మరో కీలకమైన లాయర్ పాత్రను రావు రమేశ్ పోషించగా, పోలీస్ అధికారి పాత్రలో ప్రకాశ్ రాజ్ కనిపించారు. తాజాగా ట్రైలర్ విడుదల చేయగా, ఇందులోని సన్నివేశాలు చాలా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ‘పోరాడుదాం పోరాడుదాం.. న్యాయం జరిగేవరకు పోరాడుదాం’ అన్న నినాదాలతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. అమాయక గిరిజనుల కోసం పోరాడుతున్న లాయర్‌గా సూర్య అదరగొట్టాడు.
‘జై భీమ్’ సినిమా దీపావళి సందర్భంగా నవంబర్ 2న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. దీనిని 2 డి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో సూర్య, జ్యోతిక సంయుక్తంగా నిర్మించారు.అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం సూర్య వరుసగా నాలుగు సినిమాలను నిర్మించి ఇవ్వడానికి అగ్రిమెంట్ చేసుకున్నారు. అందులో ఇదొక సినిమా. త.సె. జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ‘జై భీమ్’లో ఇతర ప్రధాన పాత్రలను రజీషా విజయన్, మణికందన్, లిజో మోల్ జోస్ పోషించారు.