కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణం కేవలం శాండల్‌వుడ్‌కు మాత్రమే కాదు అన్ని ఇండస్ట్రీలకు షాక్ అనే చెప్పాలి. కెరీర్ పీక్ స్టేజిలో ఉన్నప్పుడే పునీత్ హఠాన్మరణం చెందడం అందర్నీ కలిచివేసింది. అందుకే ఆయన మరణ వార్త తెలియగానే టాలీవుడ్ సినీ పెద్దలు చాలామంది స్పందించారు. చిరంజీవి, వెంకటేశ్, బాలకృష్ణ, ఎన్టీఆర్ వంటి హీరోలు బెంగళూరు వెళ్లి మరి పునీత్ పార్థివదేహానికి నివాళులర్పించారు. అతనితో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. చిన్న వయసులోనే పునీత్ వెళ్లిపోతాడని అస్సలు ఊహించలేదంటూ ఎమోషనల్ అయ్యారు. కానీ మన పొరుగున ఉన్న తమిళ ఇండస్ట్రీ నుంచి మాత్రం ఒక్కరు కూడా పునీత్ అంత్యక్రియలకు వెళ్లలేదు. ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ అయింది.
పునీత్ రాజ్‌కుమార్ మరణవార్త తెలియగానే కర్ణాటక మొత్తం దిగ్భ్రాంతికి లోనైంది. కన్నడ ఇండస్ట్రీ అయితే మూడు రోజులుగా పునీత్ నామస్మరణ చేసింది. ఆ రాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. కర్ణాటక సీఎం స్వయంగా దగ్గరుండి అంత్యక్రియలు జరిపించారు. టాలీవుడ్ నుంచి కూడా చాలామంది హీరోలు వెళ్లి పునీత్ భౌతికకాయానికి నివాళులర్పించి వచ్చారు. కానీ కోలీవుడ్ నుంచి ఆమత్రం ఒక్కరు కూడా పవర్ స్టార్ అంత్యక్రియలకు హాజరు కాలేదు. నిజానికి తమిళ ఇండస్ట్రీలో విజయ్, సూర్య, విశాల్ వంటి హీరోలతో పునీత్ రాజ్‌కుమార్‌కు మంచి స్నేహం ఉంది. అయినా కూడా వాళ్లు అతని కడసారి చూపునకు రాలేదు. దీనికి కారణం కావేరీ జలాల సమస్య అని తెలుస్తోంది.
కర్ణాటక, తమిళనాడు మధ్య ఎన్నో సంవత్సరాలుగా కావేరీ జలాల సమస్య నడుస్తోంది.దీనిపై సినిమా ఇండస్ట్రీ కూడా ముందకొచ్చింది. తమిళ సినిమాలను కర్ణాటకలో విడుదల చేయకూడదని అప్పట్లో కన్నడ హీరోలు రోడ్డెక్కారు. ఇలాంటి సమయంలో పునీత్ అంత్యక్రియలకు హాజరైతే రాజకీయంగా సమస్యలు ఎదురవుతాయనే ఉద్దేశంతోనే కోలీవుడ్ హీరోలు ఎవరూ రాలేదని సోషల్ మీడయాలో ప్రచారం జరుగుతుంది.