అమ్మాయిల విద్యాభ్యాసం సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు మొదటిమెట్టు అని సమాచార పౌర సంబంధాల శాఖ సహాయ సంచాలకులు జి. లక్ష్మణ్ కుమార్ అన్నారు. `ఏక్ భారత్ – శ్రేష్ట భారత్ ` కార్యక్రమం ద్వారా భారత దేశ విశిష్టతలు ప్రజలందరూ విపులంగా తెలుసుకుంటున్నారని ఆయన వివరించారు.
కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన క్షేత్ర ప్రచార విభాగం వరంగల్ యూనిట్ ఆధ్వర్యంలో నగరంలోని పింగిలి మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాలలో సోమవారం నిర్వహించిన కార్యక్రమానికి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. క్షేత్ర ప్రచార అధికారి శ్రీధర్ సూరునేని ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తూ భారత స్వాత్రంత్య పోరాట ఘట్టాలను ప్రజలకు క్షేత్రస్థాయిలో తెలియజేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం నిర్వహిస్తోందని వెల్లడించారు. ఏక్ భారత్ శ్రేష్ట భారత్ కార్యక్రమంలో భాగంగా భారతదేశం యొక్క ప్రత్యేకతలను విపులీకరిస్తున్నట్లు వెల్లడించారు.
అనంతరం సమాచార పౌర సంబంధాల శాఖ సహాయ సంచాలకులు జి. లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ అమ్మాయిల చదువు సమాజం యొక్క దశను మారుస్తుందని తెలిపారు. మేడం క్యూరీ ఉన్నత చదువులతో నోబెల్ బహుమతి సాధించగా ఆమె స్ఫూర్తిగా తీసుకున్న క్యూరీ భర్త సైతం నోబెల్ సాధించారని వివరించారు. ఇంతటి శక్తి మహిళల విద్యకు ఉందని లక్ష్మణ్ పేర్కొన్నారు. భారతదేశ సుసంపన్న సంస్కృతిని తెలియజేసేందుకు ఏక్ భారత్- శ్రేష్ట భారత్ కార్యక్రమాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు.
అనంతరం కాలేజీ వైస్ ప్రిన్సిపల్ రవి మాట్లాడుతూ తమ కళశాల విద్యార్థులు ప్రత్యేక ప్రతిభను కనబర్చి యూత్ పార్లమెంటులో ప్రాతినిధ్యం వహించే స్థాయికి చేరుకున్నారని తెలిపారు. పింగిళి కళాశాలకు చెందిన విద్యార్థులు విద్యా సంబంధమైన అంశాలతో పాటుగా సామాజిక అంశాలలోనూ నైపుణ్యాలు కనబరుస్తున్నారని వివరించారు. అనంతరం ఈ కార్యక్రమంలో పింగిళి కళాశాలకు చెందిన విద్యార్థులచే వకృత్వ పోటీలు నిర్వహిం విజేతలకు సమాచార పౌర సంబంధాల శాఖ సహాయ సంచాలకులు శ్రీ జి. లక్ష్మణ్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో క్షేత్ర ప్రచార అధికారి శ్రీధర్ సూరునేని ఐఐఎస్, పింగిళి కళాశాల అకడమిక్ కోఆర్డినేటర్ రామకృష్ణారెడ్డి, కళాశాల అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.