రష్యా-ఉక్రెయిన్ మ ధ్య యుద్ధం జరుగుతున్న కారణంగా భారత్‌కు తిరిగివచ్చిన వైద్య విద్యార్థులు స్వదేశంలోనే చదువుకునేందుకు అనుమతించాలని ప్రధాని నరేంద్ర మోడీని తెలంగాణ సీఎం కేసీఆర్ కోరారు. ఈ మేరకు ఆయన ప్రధానికి లేఖ రాశారు. ఈ విషయంపై హ్యూమన్ యాంగిల్‌లో ఆలోచించి ప్రత్యేక కేసుగా ట్రీట్ చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు.
సుమారు 20వేలకు పైగా ఇండియన్ స్టూడెంట్స్ ఉక్రెయిన్ నుంచి వచ్చేశారని.. వీరంతా దేశంలోని వివిధ మెడికల్ కాలేజీల్లో చదువుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్‌ను కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి వచ్చిన విద్యార్థుల్లో తెలంగాణకు చెందిన వారు 700 మందికి పైగా ఉన్నారని.. వారి చదువుకు అయ్యే ఖర్చును తెలంగాణ ప్రభుత్వమే భరిస్తుందని ప్రధానికి తెలిపారు. ఈ విషయంలో వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని లేఖలో కేసీఆర్ కోరారు.