‘మీ మనసు ఖరాబైనప్పుడు ఓసారి వంటింట్లోకి వెళ్లండి. కూరగాయలు తరగండి. నచ్చిన వంటను మహారుచిగా వండండి. ఆనందంగా ఆరగించండి. అంతే, ఒత్తిడి హుష్ కాకి! ఒక్కసారి కిచెన్‌లోకి అడుగుపెడితే.. ఎంతటి ఒత్తిడి అయినా పటాపంచలై పోవాల్సిందే’ అని సలహా ఇస్తున్నారు పరిశోధకులు.
స్వయంగా వంట చేసుకోవడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని అమెరికాలోని ఎడిత్ కోవాన్ యూనివర్సిటీ (ఈసీయూ) నిర్వహించిన అధ్యయనంలో తేలింది. 657 మందిపై ఆరు నెలలపాటు నిర్వహించిన ఈ పరిశోధనలో ఎన్నో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
వంట చేయడం వల్ల ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుందని, చేయాల్సిన పనిపై శ్రద్ధ పెరుగుతుందని, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు అబ్బుతాయని, మొత్తంగా మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని తేల్చారు. కోపాన్ని, బాధలను మర్చిపోయేందుకు వంటిల్లే సరైన చోటని చెబుతున్నారు అమెరికన్ పరిశోధక బృందానికి నాయకత్వం వహించిన డాక్టర్ జోవన్నా రీస్.