ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటించిన RRR మూవీ సక్సెస్‌ఫుల్‌గా థియేటర్లలో రన్ అవుతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లు కలెక్ట్ చేసి మరిన్ని రికార్డుల దిశగా దూసుకెళ్తోంది. అయితే ఆర్‌ఆర్‌ఆర్ మూవీకి సీక్వెల్ ఉంటుందా అనే ప్రశ్న ఎన్టీఆర్, రామ్‌చరణ్ అభిమానుల్లో ఎప్పటినుంచో ఉంది.
ఈ నేపథ్యంలో ఆ సినిమా సీక్వెల్‌పై ఆర్‌ఆర్‌ఆర్ కథా రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. తమ ఇంటికి ఓ రోజు ఎన్టీఆర్ వచ్చి ఆర్‌ఆర్‌ఆర్ సీక్వెల్‌పై అడిగారని.. తాను కొన్ని ఐడియాస్ చెప్పానన్నారు. తాను చెప్పిన ఆలోచనలు ఎన్టీఆర్, రాజమౌళికి బాగా నచ్చాయని చెప్పారు. దేవుడి అనుగ్రహం ఉంటే ఆర్‌ఆర్‌ఆర్‌కి సీక్వెల్ వస్తుందని చెప్పారు విజయేంద్ర ప్రసాద్.
RRR సీక్వెల్‌పై విజయేంద్రప్రసాద్ తాజాగా చేసిన వ్యాఖ్యలపై అభిమానులు చర్చించుకుంటున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టి సీక్వెల్ ఉంటుందనే రీతిలో ఊహాగానాలు చేస్తున్నారు. ఎవరేమనున్నా.. జక్కన్న రాజమౌళి మదిలో ఏముందో తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే!