బీహార్‌లోని పట్నాలో దారుణం చోటుచేసుకుంది. చెవినొప్పితో ఓ యువతి హాస్పిటల్‌కి వెళ్తే వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఆమె తన చేయిని కొల్పోయింది. అసలేం జరిగిందటే..
శివహర్ జిల్లాకు చెందిన 20 ఏళ్ల రేఖ చెవినొప్పితో పట్నాలోని మహావీర్ ఆరోగ్య సంస్థాన్ హాస్పిటల్‌కి వెళ్లింది. ఇందుకు జులై 11న వైద్యులు సూచించిన ఇంజక్షన్‌ను నర్సు రేఖ ఎడమ చేతికి వేసింది. అనంతరం శస్ర్తచికిత్స చేసి ఇంటికి పంపించారు. తర్వాత రేఖ చేయి రంగు మారడంతో పాటు తీవ్ర నొప్పి రావడం ప్రారంభమైంది. హాస్పిటల్‌కి వెళ్లి డాక్టర్లకు చెప్పగా కొన్ని రోజుల్లో తగ్గిపోతుందని చెప్పి పంపించేశారు. ఎంతకీ తగ్గకపోవడంతో ఆమె వేరే హాస్పిటల్స్‌లో చూపించుకుంది. చివరకి పట్నాలోని మేదాంత హాస్పిటల్‌లో ఆగస్టు 4న వైద్యులు ఆపరేషన్ చేసి రేఖ ఎడమ చేతిని మోచేతి వరకు తొలగించారు. నవంబరులో పెళ్లి పీటలు ఎక్కనున్న రేఖకు చేయిలేక పోవడంతో వరుడి కుటుంబసభ్యులు పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు. చెవి నొప్పి అని వెళ్లి చేయి కోల్పోవడంతో బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.