గణేశ్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లో వైన్ షాపులు మూత పడనున్నాయి. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు బంద్ చేయనున్నారు. ఈ మేరకు హైదరాబాద్ పోలీసులు ఆంక్షలు విధించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసుశాఖ స్పష్టం చేసింది. కల్లు దుకాణాలు సైతం మూసివేయాలని ఆదేశించింది.
వినాయక నిమజ్జనం కోసం జీహెచ్ఎంసీ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేసింది. ట్యాంక్‌బండ్‌తో పాటు సరూర్‌నగర్ మినీ ట్యాంక్‌బండ్‌తో పాటు నగర వ్యాప్తంగా ఉన్న చెరువుల వద్ద నిమజ్జనాలకు ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సిటీ మొత్తం సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. ఒక్క ట్యాంక్‌బండ్ పైనే 200కి పైగా సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. అక్కడ సుమారు 12వేల మంది పోలీసులు బందోబస్తు విధుల్లో ఉంటాయని పోలీసుశాఖ వర్గాలు వెల్లడించాయి.