Site icon Dharuvu

వింత దొంగలు.. బేకరీలో కేక్ కొట్టేసి.. అక్కడే సెలబ్రేషన్స్..!

ఓ బేకరీ తాళాలు పగలగొట్టి లోపలకు వెళ్లిన దొంగలు.. వారి పని పూర్తికాగానే అక్కడ ఉన్న కేక్ కట్ చేసి పార్టీ చేసుకున్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో శనివారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనకు ఇలాంటి వింత దొంగలు ఎవరంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

నేలకొండపల్లి పట్టణంలో శశిధర్.. సాయిరాం స్వీట్స్ ఎండ్ బేకరీని నిర్వహిస్తున్నాడు. ఎప్పటిలానే శనివారం రాత్రి బేకరీకి తాళం వేసి ఇంటికి వెళ్లాడు. మరుసటి రోజు ఆదివారం ఉదయం వచ్చి షాపు తెరిచేందుకు చూడగా తాళం పగలగొట్టి ఉంది. షాపులోపలకు వెళ్లగా ఫ్రీజర్‌లో ఉన్న కేకులు కట్‌ చేసి తిని సెలబ్రేషన్స్ చేసినట్లు అక్కడి వాతావరణం ఉంది. ఇందుకు బేకరీలోని పోపర్‌లు.. మెరుపు కాగితాలు వెదజల్లే టపాసులు సైతం పేల్చారు దొంగలు. అక్కడే ఉన్న స్వీట్స్‌ కూడా లాగించేశారు. బిస్కట్లు, చాకోలెట్స్ పట్టుకెళ్లిపోయారు. అయితే కౌంటర్‌లో డబ్బులు లేకపోవడంతోనే ఇదంతా చేసుంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నాడు షాపు ఓనర్. దాదాపు రూ.20 వేల విలువైన స్వీట్లు, కేకులు, ఇతర సెలబ్రేషన్ సామగ్రి చోరీ అయ్యాయి. షాపు తాళం పగులగొట్టేందుకు వాడిన పలుగును అక్కడే వదిలేశారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Exit mobile version