బీజేపీని గద్దె దించడమే ప్రథమ లక్ష్యంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. దసరా పండుగ రోజేనే జాతీయ పార్టీ పేరు ప్రకటిస్తామని తెలిపారు. ఈ మేరకు ఆదివారం ప్రగతిభవన్‌లో మంత్రులు, అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం కేసీఆర్.
జాతీయ పార్టీకి బీఆర్‌ఎస్‌తో పాటు పలు పేర్లను పరిశీలిస్తున్నామని, విజయదశమి రోజున మధ్యాహ్నం 1.19కి పార్టీ పేరు ప్రకటిస్తామని తెలిపారు కేసీఆర్. 5వ తేదీ ఉదయం 11 గంటలకు పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరుగుతుందని ఇందులో 283 మంది సభ్యులు నేషనల్ పార్టీ ఏర్పాటును ఆమోదిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేస్తారని చెప్పారు. బీజేపీని గద్దె దించడమే ప్రథమ లక్ష్యం అని ఇందుకు మునుగోడు ఉప ఎన్నికల నుంచే పోటీ ప్రారంభిస్తామని తెలిపారు. డిసెంబరు 9న దిల్లీలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు.