చిన్నపిల్లలకు గాడిద పాలు మంచివని నమ్ముతారు. ఆ మాటకొస్తే పెద్దలకు ఇంకా మంచివని అంటున్నారు నిపుణులు. అందాన్ని రెట్టింపు చేయడంలోనూ గాడిద పాలు కీలకపాత్ర పోషిస్తాయి. పూర్వం ఈజిప్టు మహారాణి క్లియోపాత్రా గాడిద పాలతోనే స్నానం చేసేవారని అంటారు.
- గాడిద పాలలో యాంటీ ఏజింగ్ గుణాలు పుష్కలం. వీటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే వృద్ధాప్య ఛాయలు దరిచేరవు. ఈ పాలతో తయారు చేసిన సౌందర్య సాధనాలు వాడితే చర్మం మృదువుగా మారుతుందనీ, కొత్త నిగారింపు వస్తుందనీ చెబుతారు. అందుకే ఢిల్లీలోని ఓ స్టార్టప్ గాడిద పాలతో సబ్బులను తయారుచేస్తున్నది.
- గాడిద పాలలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మొటిమలను తగ్గిస్తాయి, ఇన్ఫెక్షన్లను అరికడతాయి. సూర్యరశ్మి వల్ల కలిగే ఆక్సీకరణ నుంచి చర్మ కణాలను రక్షించడంలో కీలకపాత్ర పోషిస్తాయి.
- ఈ పాలలో విటమిన్లు, ఆవశ్యక ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలం. రోజూ గాడిద పాలు ముఖానికి రాసుకుంటే ముడతలు తగ్గడంతోపాటు ఎలర్జీల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది.
- ఈ పాలలోని యాంటీ ఆక్సిడెంట్స్ పొగ, రేడియేషన్ వల్ల శరీరంలోకి ప్రవేశించే ఫ్రీ రాడికల్స్‌ను నివారిస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. జీవక్రియను మెరుగుపరుస్తాయి.