Kuppam Issue : చిత్తూరు జిల్లా కుప్పంలో ఈరోజు ఉద్రిక్తత నెలకొంది. జాతీయ, రాష్ట్ర రహదారులపై గానీ, ఇరుకు రోడ్లపై గానీ సభలు, సమావేశాలు నిర్వహించరాదంటూ ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. నెల్లూరు జిల్లా కందుకూరు, గుంటూరుల్లో ఇటీవల జరిగిన తొక్కిసలాట ఘటనల నేపథ్యంలో రాష్ట్ర హోంశాఖ ఈ మార్గదర్శకాలు జారీచేసింది. రోడ్‌షోకు అనుమతి లేనందున్న పోలీసులు చంద్రబాబు వాహనాన్ని అడ్డుకున్నారు. రోడ్ షో నిర్వహణకు అనుమతి లేదంటూ డిఎస్పీ చంద్రబాబుకు నోటీసులు అందజేశారు. దీనిపై చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సొంత నియోజకవర్గానికి ఎందుకు వెళ్లొద్దంటూ ప్రశ్నించారు. రోడ్ షోకి పర్మిషన్ ఎందుకు ఇవ్వరన్నారు. ఇంతమంది ప్రజానీకాన్ని ఇబ్బంది పెడతారా అంటూ డీఎస్పీ సుధాకర్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు.
అయితే జీవో1 ప్రకారం రహదారులపై సభలు, రోడ్‌షోలపై ఆంక్షలు ఉన్నాయని, నిబంధనలు పాటించాలని పోలీసులు సూచించారు. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలు పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు శాంతిపురం మండలం గుడ్డురు క్రాస్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. చంద్రబాబు నాయుడు సభకు వెళ్తున్న టీడీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. చంద్రబాబు సభకు అనుమతి లేదని, ఎవరూ సభకు వెళ్లవద్దంటూ పోలీసులు సూచించారు.
కాగా మైక్ పర్మిషన్ లేదని 4 ప్రచార రథాలను పోలీసులు సీజ్ చేశారు. సమావేశం కోసం శాంతిపురం మండలం కెనుమాకులపల్లి వద్ద ఏర్పాటు చేసిన స్టేజ్‌ను కూడా పోలీసులు తొలగించారు. ఈ క్రమంలో చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు వెళ్తున్న టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు, టీడీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులపై టీడీపీ కార్యకర్తలు దాడికి దిగారు. రోడ్డుపై ఏర్పాటు చేసిన బారికేడ్లను ఎత్తిపడేశారు. ఓ కార్యకర్త అయితే ఏకంగా పోలీసుపై చేయి చేసుకున్నాడు. సభకు పర్మిషన్ లేదని చెప్పినప్పటికి కూడా తెదేపా నేతలు పోలీసులపై దాడి చేయడం పట్ల వైకాపా నేతలు విమర్శిస్తున్నారు.