HARISH RAO: సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన ఛైర్మన్, పాలకవర్గం ప్రమాణస్వీకార కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. దేశ ప్రజలంతా కేసీఆర్ వైపు చూస్తున్నారని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. ప్రజల కోసమే భారాస, కేసీఆర్ ప్రతి అడుగు వేస్తారని మంత్రి తెలిపారు. రాబోయే ఎన్నికల్లో భారాస తప్పక విజయం సాధిస్తుందని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. కాంగ్రెస్, భాజపా నేతలు చేస్తున్న అవాస్తవాలను ప్రజలు, కార్యకర్తలు ఎదురించాలని పిలుపునిచ్చారు.
బీఆర్‌ఎస్ వేసే ప్రతి అడుగు రైతుల కోసమే నని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ ఏదేమైనా ప్రజల కోసమే పోరాడుతున్నారని తెలిపారు. దేశ సాగు వృద్ధిరేటు 4 శాతమే ఉంటే…. రాష్ట్ర సాగు రేటు 8 శాతం ఉందని గుర్తు చేశారు. గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు సాయం చేయడంతో పాటు ప్రాజెక్టును పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. సమైక్య పాలనలో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని వివరించారు
గౌరవెల్లి ప్రాజెక్టులో నీళ్లు నింపి లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ఇదివరకే ప్రాజెక్టుకు 86.97 కోట్ల రూపాయలు ….అదనంగా నిధులు మంజూరు చేశారని మంత్రి స్పష్టం చేశారు. త్వరలోనే ఉగాది తర్వాత గర్భిణులకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పంపిణీ చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. పండగ తర్వాత నిధులు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు.