MINISTER VEMULA: ప్రధాని మోదీ నిజంగా సత్యవంతుడైతే అదానీపై సీబీఐ, ఈడీతో విచారణ జరిపించాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. బాల్కొండ నియోజకవర్గంలోని భాజపా, కాంగ్రెస్, బీఎస్పీ పార్టీలకు చెందిన సుమారు 500 మంది…..మంత్రి సమక్షంలో భారాస తీర్థం పుచ్చుకున్నారు.
దేశంలో మోదీ అవినీతి పాలనకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే పోరాటం చేస్తున్నారని తెలిపారు. కేసీఆర్ కు మద్దతుగా ప్రతి ఒక్కరూ నిలవాలని పిలుపునిచ్చారు. మోదీ పాలనలో ఎవరెవరకి ప్రయోజనం చేకూరిందో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ప్రజలు కూడా మరొకసారి దేశంలో ఏం జరుగుతుందో ఆలోచించాలని హితవు పలికారు. తెలంగాణ ప్రభుత్వంపై బురద జల్లడం తప్ప భాజపాకు మరో పని చేతకాదని ధ్వజమెత్తారు. కేంద్రం నుంచి గ్రామాలకు నిధులెంత వస్తున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రం నుంచి కేంద్రానికి 3.70లక్షలకోట్లు రూపాయలు…..పన్నుల రూపంలో కడితే 1.70లక్షల కోట్లు మాత్రమే ఇచ్చారని గుర్తు చేశారు. దేశానికి వస్తున్న సొమ్మంతా భాజపా రాష్ట్రాలను పోతున్నాయన్నారు. చివరకు మోదీ దేశ ప్రధాని అయ్యాక ఎన్నడూ లేని డాలర్ విలువ ఎంత క్షీణించిందో అందరికీ తెలుసన్నారు. ప్రధాని పాలనలో నిరుద్యోగ రేటు బాగా పెరిగిందని అన్నారు. పెట్రోల్, డీజిల్ ధర కూడా భారీగానే పెరిగిందని తెలిపారు.
గ్యాస్ సిలిండర్ ధర 1200 రూపాయల వరకు పెంచారని మండిపడ్డారు. అన్యాయంగా సంపాదించిన సొమ్ముతో జల్సాలు చేస్తున్నారని మండిపడ్డారు. అంతేకాకుండా ఎవరైనా మాట వినకపోతే తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.